మన శరీరంలో ఉండే సున్నితమైన భాగాల్లో పెదవులు కూడా ఒకటి. చక్కని చిరునవ్వు మన సొంతం కావాలంటే మన పెదవులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మన పెదవులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. మన చర్మంపై 16 పొరలు ఉంటాయి. కానీ మన పెదవుల మీద మూడు నుండి నాలుగు పొరలు మాత్రమే ఉంటాయి. కనుకనే మన పెదవులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే పెదవులు నల్లగా మారడం, పొడి బారడం, పెదవులు పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మన పెదవులు పొడిబారడం సర్వసాధారణం. కనుక పెదవులకు ఎల్లప్పుడూ తేమను అందించాలి. అలాగే పెదవులపై మృతకణాలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. పెదవులకు తేమను అందించేలా లిప్ బామ్ ను, పెదవులపై ఉండే మృతకణాలను తొలగించేలా లిప్ లిప్ స్క్రబర్ ను మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా లిప్ స్ర్కబర్ ను ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ఒక గిన్నెలో తెల్లగా ఉండే ఏదైనా ఒక టూత్ పేస్ట్ ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసి రెండు కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక టూత్ బ్రష్ తో తీసుకుంటూ పెదవులపై రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా మర్దనా చేసిన తరువాత 5 నిమిషాల పాటు ఉంచి అనంతరం పెదవులను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఉండే మృతకణాలు తొలగిపోవడంతోపాటు పెదవులపై ఉండే నలుపు కూడా తొలగిపోయి పెదవులు అందంగా మృదువుగా తయారవుతాయి.
ఇంట్లో లిప్ బామ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ మోతాదులో పెట్రోలియం జెల్లీని తీసుకోవాలి. ఈ గిన్నెను నీళ్లు ఉన్న మరో గిన్నెలో ఉంచి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల జెల్లీ ద్రవరూపంలోకి మారుతుంది. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ ను, అలాగే విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి బాగా కలపాలి. విటమిన్ ఇ క్యాప్సుల్ అందుబాటులో లేని వారు గ్లిజరిన్ ను ఉపయోగించవచ్చు.
ఇలా తయారు చేసుకున్న లిప్ బామ్ ను తడి లేని చిన్న డబ్బాలో గాలి తగలకుండా పెట్టి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ లిప్ బామ్ ను ముందుగా చెప్పిన లిప్ స్క్రబర్ ను ఉపయోగించిన తరువాత పెదవులకు రాసుకోవాలి. ఈ లిప్ బామ్ ను వాడడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గడమే కాకుండా పెదవులు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. దీనిని వాడడం మొదలు పెట్టిన వారం రోజుల్లోనే మనం తేడాను గమనించవచ్చు.
ఈ విధంగా ఇంట్లోనే లిప్ బామ్ ను, లిప్ స్ర్కబర్ ను తయారు చేసుకుని చాలా తక్కువ ఖర్చులోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మన పెదవులను ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.