జుట్టు సమస్యలు సహజంగానే చాలా మందికి ఉంటాయి. వెంట్రుకల చివర్లు చిట్లడం, రాలడం, నెరవడం… వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వులతో కింద తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి.
జుట్టు రాలకుండా ఉండేందుకు
ఏడెనిమిది చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు.
జుట్టు నెరుస్తుంటే
గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
జుట్టు చివర్లు చిట్లుతుంటే
మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి నలభై నిమిషాల తరువాత కడిగేసుకుంటే చాలు. జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
షాంపూలాగా
ఒక గిన్నెలో కొన్ని గ్లాసు నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పువ్వులు వేసి కాసేపు మరిగించాలి. అది చల్లారాక ఆకుల్ని ముద్దలా చేసి, కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూ తయారవతుంది. దీన్ని తలకు రాసి షాంపూలా ఉపయోగించుకోవచ్చు.
కండిషనర్
ఏడెనిమిది మందార పువ్వులను ముద్దలా నూరుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ మిశ్రమం కండిషనర్‌లా పనిచేస్తుంది.