Vitamin E Oil For Face : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ ఇ కూడా ఒకటి. శరీరంలో అవయవాల పనితీరుకు అవసరమయ్యే పోషకాల్లో ఇది ఒకటి. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. మనకు కూరగాయలు, తృణ ధాన్యాలు, మాంసం, గుడ్లు, పండ్లు వంటి ఆహరాలలో విటమిన్ ఇ ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఇ క్యాప్సుల్స్ కూడా మనకు బయట మార్కెట్ లో లభిస్తాయి. సహజ సిద్దంగా లభించే విటమిన్ ఇ ( ఆల్ఫా టోకోఫెరోల్) కంటే క్యాప్సుల్స్ రూపంలో ఉండే విటమిన్ ఇ ( ఆల్ రాక్ ఆల్ఫా టోకోఫెరల్) భిన్నంగా ఉంటుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేయడంతో పాటు మన చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై ముడతలను తగ్గించడంలో విటమిన్ ఇ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
విటమిన్ ఇ నూనెను నేరుగా చర్మంపై రాసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు చర్మ కణాల్లో ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మం యవ్వనంగా కనబడేలా చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మం పొడిబారడాన్ని తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చేయడంలో కూడా విటమిన్ ఇ మనకు ఉపయోగపడుతుంది. అలాగే చర్మం పై ఉండే నల్లటి మచ్చలను తొలగించి చర్మం అందంగా కనబడేలా చేయడంలో కూడా ఇది దోహదపడుతుంది. విటమిన్ ఇ నూనెను వాడడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో కూడా విటమిన్ ఇ మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో, చర్మాన్ని శుభ్రం చేయడంలో విటమిన్ ఇ నూనె మనకు తోడ్పడుతుంది.
ఈ నూనెను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. పెదవులు పగిలినప్పుడు విటమిన్ ఇ నూనెను రాసుకోవడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. విటమిన్ ఇ నూనెను మనం ఎలాగైనా ఉపయోగించవచ్చు. మనం వాడే వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి చర్మానికి రాసుకోవచ్చు. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు దీనిని చర్మానికి రాసుకుని ఉదయాన్నే కడిగి వేయవచ్చు. అదే విధంగా విటమిన్ ఇ ఉండే ఫేస్ మాస్క్ లు కూడా మనకు మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా విటమిన్ ఇ మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.