Cholesterol : ప్రస్తుత కాలంలో శరరీంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే. కానీ మన అవసరానికి మించి కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మనం బరువు పెరగడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ మందగించి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం.
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది వంశపారపర్యంగా కూడా వస్తుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి చేయడం వల్ల వంశపారపర్యంగా మనం అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, ఆహార నియమాలను పాటించడం అలాగే జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మాంసం, గుడ్లు, నూనెలో వేయించిన పదార్థాలు, కొవ్వు పదార్థాలను, మైదాపిండితో చేసిన పదార్థాలు, పంచదారతో తయారు చేసిన పదార్థాలు, ధూమపానం, మద్యపానం, ప్యాకెట్ లల్లో నిల్వ ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చిరు ధాన్యాలతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. అలాగే పండ్ల రసాలను, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. ఉదయం పూట వీలైనంత వరకు నూనె లేకుండా వండిన పదార్థాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు కొన్ని రకాల చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను చాలా సులభంగా కరిగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 20 గ్రా. ధనియాలు, ఒక పెద్ద దాల్చిన చెక్కను, 10 గ్రా. తెల్ల ఆవాలు, 2 టీ స్పూన్ల పసుపు, 10 గ్రాముల సోంపును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఈ పదార్థాలన్నింటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి 5 నుండి 6 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని గోరు వెచ్చగా అయిన తరువాత గ్లాస్ లోకి తీసుకుని రోజూ ఉదయం అల్పాహారం చేసిన తరువాత తాగాలి. దీనితో పాటు ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కూడా మనం శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ ఒక కట్ట పాలకూరను, ఒక చిన్న కప్పు కొత్తిమీరను, ఒక బీట్ రూట్ ను, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ ఆవనూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక జార్ లో పాలకూరను శుభ్రం చేసి వేసుకోవాలి. తరువాత బీట్ రూట్ ను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి జ్యూస్ లా చేసుకోవాలి. ఈ జ్యూస్ ను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.అలాగే రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల కూడా మనం మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. వ్యాయామం చేయాలి. మాంసాన్ని తక్కువగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది.