మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవి ఏమున్నప్పటికీ మలబద్దకం సమస్యను వెంటనే తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. దాని వల్ల హెమరాయిడ్స్, ఫిషర్స్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో తీవ్రత మరింత ఎక్కువవుతుంది. అయితే మలబద్దకాన్ని తగ్గించుకునేందుకు పలు రకాల జ్యూస్‌లు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పైనాపిల్ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పైనాపిల్‌లో బ్రొమెయిలిన్ అనబడే ఎంజైమ్ ఉంటుంది. ఇది విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. పైనాపిల్‌లో ఉండే ఔషధ గుణాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. పేగుల్లో మలం సరిగ్గా కదిలేలా చేస్తాయి. అందువల్ల రోజూ పైనాపిల్ జ్యూస్‌ను తాగితే మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.
2. మలబద్దకాన్ని తగ్గించడంలో యాపిల్ జ్యూస్ కూడా బాగానే పనిచేస్తుంది. యాపిల్ పండ్లలో ఫైబర్, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. యాపిల్ జ్యూస్‌లో కొద్దిగా సోంపు గింజల పొడిని కలుపుకుని తాగితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం అవుతుంది.
3. ద్రాక్ష పండ్ల జ్యూస్‌ను తాగుతున్నా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. ద్రాక్షల్లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను నయం చేస్తుంది.
4. నారింజ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. అందువల్ల ఈ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగితే ఫలితం ఉంటుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
5. నిమ్మకాయల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల మలబద్దకం ఉన్నవారికి ఎంతగానో దోహదపడతాయి. శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, జీలకర్రను కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365