నిద్రలేమి సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి బెడ్ మీద పడుకున్నాక ఎప్పటికో ఆలస్యంగా నిద్రపోతున్నారు. మరుసటి రోజు త్వరగా నిద్రలేవ లేకపోతున్నారు. ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చాలా మంది మంచం మీద పడుకున్నాక ఎంత కళ్లు మూసుకుని ప్రయత్నించినా నిద్ర రావడం లేదని అంటుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. పడుకున్న వెంటనే నిద్రిస్తారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు గోరు వెచ్చని రాగి జావను తాగాలి. జావ చాలా పలుచగా ఉండేలా చూసుకోవాలి. రాగి జావ తాగలేం అనుకుంటే సగ్గు బియ్యం లేదా బార్లీ గింజలతో చేసే జావ తాగవచ్చు. అవి కూడా వద్దనుకుంటే చిరుధాన్యాలతో జావ చేసుకుని తాగవచ్చు. వాటిల్లో ఉండే ప్రోటీన్లు త్వరగా నిద్ర వచ్చేలా చేస్తాయి. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
2. చాలా మంది మధ్యాహ్నం నిద్రిస్తుంటారు. కేవలం గంటే కదా అని అనుకుంటుంటారు. కానీ మధ్యాహ్నం 1 గంట నిద్రించినా అది రాత్రి పూట 2 గంటల నిద్రకు సమానం. అందువల్ల రాత్రి త్వరగా నిద్ర పట్టదు. కనుక రాత్రి వెంటనే నిద్ర పట్టాలంటే మధ్యాహ్నం నిద్రను మానేయాలి. అయితే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మధ్యాహ్నం నిద్రించవచ్చు. కేవలం వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. మిగిలిన ఎవరైనా సరే కేవలం రాత్రి పూట మాత్రమే నిద్రించాలి.
3. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా విప్ప పూలు లభిస్తాయి. వీటిని 5-6 తీసుకుని రాత్రి నిద్రకు 3 గంటల ముందు నీటిలో నానబెట్టాలి. తరువాత నిద్రించేముందు తినాలి. దీంతో గాఢ నిద్ర పడుతుంది.
4. రాత్రి భోజనం అనంతరం 30 నిమిషాలు ఆగి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. దీని వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
5. గసగసాలను చాలా మంది కూరల్లో వేస్తుంటారు. వీటి పొడిని పావు టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. నిద్ర వెంటనే పడుతుంది.