శరీరం మొత్తం సన్నగా ఉన్నప్పటికీ కొందరికి పొట్ట దగ్గరి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శరీరాకృతి హీనంగా కనిపిస్తుంది. దీని వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఇక అధిక బరువు ఉండేవారికి కూడా పొట్ట దగ్గరి కొవ్వు ఇబ్బందులకు గురి చేస్తుంది. అది ఒక పట్టాన తగ్గదు. కానీ ఆయుర్వేద ప్రకారం కింద తెలిపిన 9 సూచనలు పాటిస్తే దాంతో పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. రోజూ మధ్యాహ్నం సమయంలో జీర్ణశక్తి ఎవరికైనా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజులో తినే ఆహారంలో ఎక్కువ మొత్తాన్ని ఆ సమయంలోనే తినాలి. మీరు రోజూ తినడం వల్ల వచ్చే క్యాలరీల్లో 50 శాతం క్యాలరీలను మధ్యాహ్నం భోజనంతోనే అందేలా చూసుకోవాలి. అంటే మీరు రోజుకు 2000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాలను మూడు పూటలా తింటుంటే.. అందులో 50 శాతం.. అంటే.. 1000 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాలను మధ్యాహ్నం పూట తినాలన్నమాట. మిగిలిన దాంట్లో అధిక భాగాన్ని పొద్దున తినాలి. తరువాత చాలా స్వల్ప మొత్తంలో క్యాలరీలు అందేలా రాత్రి భోజనం చేయాలి. అది కూడా రాత్రి 7 లోపు భోజనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువు తగ్గుతారు.
2. పిండి పదార్థాలను అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అది పొట్ట దగ్గర చేరుతుంది. కనుక కార్బొహైడ్రేట్లను తక్కువగా తినాలి. ప్రోటీన్లు, కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు అంటే.. ఆరోగ్యకరమైన కొవ్వులు. అవి వృక్ష సంబంధ పదార్థాల్లో ఉంటాయి. నట్స్, ఆలివ్ ఆయిల్, విత్తనాలు లాంటివన్నమాట. వాటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.
3. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగుతుండాలి. దీంతో పొట్ట కరిగి ఫ్లాట్‌గా మారుతుంది.
4. Garcinia Cambogia అనబడే మూలికకు చెందిన ట్యాబ్లెట్లను రోజూ వాడవచ్చు. దీన్నే వృక్షమాల అంటారు. ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తాయి. వీటిని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
5. త్రిఫల చూర్ణంను రోజూ తీసుకోవాలి. రాత్రి పూట అర టీస్పూన్ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగుతుండాలి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కొవ్వు కరుగుతుంది.
6. రోజూ ఉదయం సాయంత్రం కొద్దిగా అల్లాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో శరీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
7. రోజూ ఖాళీ కడుపుతో ఉదయం కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు.
8. ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీటిని తాగరాదు. గోరు వెచ్చని నీటినే తాగాలి. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
9. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగితే అది శరీరంలో కొవ్వు కింద మారుతుంది. కనుక ఆహారాన్ని సరిగ్గా నమిలి మింగాలి. చాలా నెమ్మదిగా భోజనం చేయాలి. దీని వల్లి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కొవ్వు పేరుకుపోదు. ఉన్న కొవ్వు కరుగుతుంది.