తలనొప్పి అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. అధికంగా ఒత్తిడికి గురయ్యే వారికి తలనొప్పి వస్తుంది. ఆందోళన, కంగారు పడేవారికి, పలు ఇతర సమస్యలు ఉన్నవారికి తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ కూడా ఒక రకమైన తలనొప్పే. కానీ సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య తేడాలు సులభంగా గుర్తించలేరు. కానీ కింద తెలిపిన విషయాలను పరిశీలిస్తే దాంతో ఆ రెండింటి మధ్య తేడాలను సులభంగా గుర్తించవచ్చు. మరి ఆ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటంటే..
సాధారణ తలనొప్పి అయితే ఒత్తిడి కారణంగా వస్తుంది. తలమొత్తం లేదా నుదురు నొప్పిగా ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా మార్చుకున్నా లేదా హెర్బల్ టీ, కాఫీ, టీలను తాగినా.. సాధారణ తలనొప్పి కాసేపటికి తగ్గిపోతుంది.
మైగ్రేన్ తలనొప్పి అయితే ఒక పట్టాన తగ్గదు. కనీసం 4 నుంచి 72 గంటల పాటు నిరంతరాయంగా ఉంటుంది. తలకు ఒక వైపు మాత్రమే నొప్పి వస్తుంది. బండతో కొట్టినట్లు, గుచ్చినట్లు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇలా ఉంటే దాన్ని మైగ్రేన్‌గా భావించాలి. ఇక తలనొప్పి వస్తూ పోతూ ఉన్నా దాన్ని మైగ్రేన్‌గానే భావించాలి. ఈ విధంగా లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. మైగ్రేన్ అయితే చికిత్స తీసుకోవాలి.
సాధారణ తలనొప్పి ఒత్తిడి వల్ల వస్తే మైగ్రేన్ మాత్రం ఒక నాడీ సంబంధ పరిస్థితి కనుక పలు ఇతర కారణాల వల్ల వస్తుంది. నిద్రలేమి, అతిగా కెఫీన్ తీసుకోవడం, మద్యం ఎక్కువగా సేవించడం, పాలు, పాల ఉత్పత్తులు పడకపోవడం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వంటి కారణాల వల్ల మైగ్రేన్ వస్తుంది. తలనొప్పితోపాటు వికారం, అసిడిటీ, వాంతికి వచ్చినట్లు ఉండడం, కాంతి లేదా శబ్దాలను తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటే.. దాన్ని కచ్చితంగా మైగ్రేన్‌గా భావించాలి.
మైగ్రేన్ లక్షణాలను గుర్తించాక వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి.