భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పసుపును తమ వంటింటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. పసుపును మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. అయితే చర్మానికి వన్నె తేవడంలో పసుపు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించాలే కానీ అనేక చర్మ సమస్యలను సైతం నయం చేసుకోవచ్చు. పసుపును ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రదాయినిగా చెబుతుంటారు. దీంతో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపును ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. శరీరం మీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.