Nela Usiri Plant : మన ఇండ్ల చుట్టూ, పొలాల గట్ల మీద, చేలలో ఎక్కడపడితే అక్కడ పెరిగే మొక్కలల్లో నేల ఉసిరి మొక్క కూడా ఒకటి. నేల ఉసిరి మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క 2 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. ఆకుల కింది భాగంలో కాయలు ఉంటాయి. చాలా మంది దీనిని కలుపు మొక్కగా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. శరీరంలో వచ్చే వాత, కఫ, పిత దోషాలను నయం చేయడంలో ఈ మొక్క అద్భుతుంగా పని చేస్తుంది. అలాగే మనకు తెలుపు, ఎరుపు రంగుల్లో ఈ మొక్క లభిస్తుంది. అలాగే నేల ఉసిరి మొక్క చేదు, వగరు, తీపి రుచులను కలిగి ఉంటుంది.
నేల ఉసిరిలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్రణాలను, పుండ్లను మానేలా చేసే అద్భుతమైన గుణం ఈ మొక్కలో ఉంది. ఈ మొక్క ఆకులను దంచి దాని నుండి రసాన్ని తీయాలి. తరువాత ఈ రసంలో పసుపు కలిపి పుండ్లపై, వ్రణాలపై రాయడం వల్ల అవి త్వరగా తగ్గు ముఖం పడతాయి. అలాగే నేల ఉసిరి ఆకులను దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని మూడు లేదా నాలుగు చుక్కల మోతాదులో ముక్కులో వేసుకుని పీల్చడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి. చాలా మంది స్త్రీలు బహిష్టు సమయంలో అతి ఋతు రక్తస్రావం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నేల ఉసిరి మొక్కను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ మొక్క గింజలను బియ్యం కడిగిన నీటితో నూరాలి. ఈమిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో రెండు పూటలా సేవిస్తూ ఉంటే నెలసరి సమయంలో అతి రక్తస్రావం సమస్య తగ్గుతుంది. పిల్లల్లో వచ్చే గజ్జి, చిడుము వంటి సమస్యలను తగ్గించడంలో కూడా నేల ఉసిరి మొక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను పుల్లటి మజ్జిగతో నూరి సమస్య ఉన్న చోట లేపనంగా రాస్తూ ఉంటే చర్మ రోగాలు తగ్గుతాయి. అదే విధంగా పాండు రోగాన్ని తగ్గించడంలో కూడా నేల ఉసిరి మొక్క అద్భుతుంగా పని చేస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు నేల ఉసిరి వేర్లను 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. తరువాత వీటిని దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అర గ్లాస్ ఆవు పాలలో రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకోవాలి.
ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పాండు రోగం తగ్గు ముఖం పడుతుంది. రక్త విరోచనాలను తగ్గించే గుణం కూడా నేల ఉసిరికి ఉంది. నేల ఉసిరి ఆకులు 3 గ్రా., మెంతులు 3 గ్రా. మోతాదులో కలిపి మంచి నీటితో కలిపిమెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రా. పెరుగులో కలిపి రోజుకు రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తవిరోచనాలు తగ్గుతాయి. ఈ విధంగా నేల ఉసిరి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.