Honey Bees Sting : తేనెటీగలు.. ఇవి మనందరికి తెలిసినవే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో తేనెటీగలు మానవులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి పూల నుండి మకరందాన్ని సేకరించి తేనెగా మారుస్తాయి. వీటి శాస్త్రీయనామం ఎపిస్. ఒక్కో తేనెతెట్టలో దాదాపు 50, 000 తేనెటీగలు ఉంటాయి. తేనెటీగల జీవితకాలం 30 నుండి 60 రోజుల వరకు ఉంటుంది. అలాగే ఇవి గంటకు 32 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. తేనెటీగలు తయారు చేసే తేనెను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. తేనె ఎంతటి మధురమైన రుచిని కలిగి ఉంటుందో మనందరికి తెలిసిందే. ఈ తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈ తేనె కలిగి ఉంటుంది. షుగర్ ను నియంత్రించడంలో, బీపీని అదుపులో ఉంచడంలో కూడా తేనె మనకు ఉపయోగపడుతుంది.
అలాగే బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా తేనె మనకు దోహదపడుతుంది. గాయాలపై అలాగే కాలిన గాయాలపై తేనెను రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. శరీరంలో ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, ఆస్థమా బారిన పడకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, దంతాల నొప్పులను తగ్గించడంలో ఈ తేనె మనకు ఉపయోగపడుతుంది. అయితే అనుకోకుండా ఒక్కోసారి మనం తేనెటీగల దాడికి గురి అవుతూ ఉంటాం. ఇతర కీటకాలు కుట్టిన దాని కంటే కూడా తేనెటీగ కుట్టడం అనేది మనల్ని మరింత బాధపెడుతుంది. వీటి దాడి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. తేనెటీగ కుట్టిన చోట చర్మం ఎర్రగా మారడంతో పాటు మంట, నొప్పి, వాపు కూడా ఉంటుంది. తేనెటీగల దాడికి గురి అయినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెటీగ కుట్టిన తరువాత మంట తగ్గడానికి ఒక వస్త్రంలో ఐస్ ముక్కలను ఉంచి కుట్టిన చోట పెడుతూ ఉండాలి. అలాగే కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదిలించకుండా ఉండాలి. అలాగే ప్రాంతంలో మరీ బిగుతుగా కాకుండా వస్త్రంతో కట్టు కట్టాలి. అలాగే తేనెటీగ కుట్టిన చోట గడ్డి చామంతి మొక్క ఆకుల రసాన్ని రాయాలి. గడ్డి చామంతి మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. ఈ మొక్క ఆకులను సేకరించి మెత్తగా దంచి వస్త్రంలో ఉంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తేనెటీగ కుట్టిన చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల మంట, నొప్పి తగ్గుతుంది. ఇలా ప్రథమ చికిత్స చేసిన తరువాత వెంటనే వైద్యున్ని దగ్గరికి వెళ్లి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.