Kidney Stones : మన శరీరంలోని విష పదార్థాలను, మలినాలను, అధికంగా ఉండే మినరల్స్ ను బయటకు పంపించే అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. అయితే తగినన్ని నీళ్లు తాగకపోవడం, పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం వల్ల మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించలేవు. దీంతో ఈ మలినాలన్ని మూత్రపిండాల్లో చిన్న చిన్న ఉండలుగా పేరుకుపోతాయి. ఈ ఉండలే గట్టిపడి మూత్రపిండాల్లో రాళ్ల లాగా మారతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యి మనలో చాలా మంది అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను కరిగించుకోవడానికి వేలకు వేలకు ఖర్చు చేస్తున్నారు. మందులు వాడడం వల్ల చిన్న పరిమానంలో ఉన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తాయి. కానీ పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఈ చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లను మనం సహజ సిద్దంగా ఆయుర్వేదం ద్వారా కూడా తొలగించుకోవచ్చు. కొండపిండి మొక్కను ఉపయోగించి మనం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. ఈ మొక్క మనందరికి తెలిసిందే. పొలాల గట్ల మీద, చేల కంచెల వెంబడి, నీటి తడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని పిండి కూర, తెలగ పిండి అని కూడా పిలుస్తారు. ఈ కొండపిండి మొక్క మొత్తాన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని నీటిలో వేసి మరిగించి వడకట్టి ఒక కప్పు లోకి తీసుకోవాలి. దీనిలో పాలు, పంచదార వేసి టీ లా తయారు చేసుకుని తాగవచ్చు.
ఇలా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎప్పటికప్పుడు మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రపిండాల్లో 5 నుండి 8 ఎమ్ ఎమ్ వరకు ఉన్న రాళ్లను ఈ కొండపిండి మొక్కను ఉపయోగించి తొలగించుకోవచ్చు. ఈ మొక్క ఆకులను సేకరించి రసం చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగి బయటకు వస్తాయి. ఈ ఆకులకు ఒక కప్పు నీటిని జత చేసి జ్యూస్ లా చేసుకోవాలి.దీనికి ఒక టీ స్పూన్ జీలకర్రను, రుచికి తగినంత పటిక బెల్లాన్ని కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను 5నుండి 15 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. ఇలా జ్యూస్ ను తాగలేని వారు ఈ కొండపిండి మొక్క మొత్తాన్ని సేకరించి ముక్కలుగా చేయాలి. వీటిని పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో 2 గ్రాములు శిలాజిత్ పొడిని, 2 గ్రాముల పటిక బెల్లం పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.
అలాగే దీనిని తీసుకున్న తరువాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కూడా రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా ఈ మొక్క ఆకులతో పప్పును తయారు చేసుకోవచ్చు. అలాగే పులుసు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొండపిండి మొక్కను ఉపయోగించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, వ్యర్థ పదార్థాలన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో కూడా మూత్రపిండాల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.