Semiya Nimmakaya Pulihora : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. సేమియాతో వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. సేమియా పులిహోర, సేమియా పాయసం వంటివే కాకుండా నిమ్మరసం వేసి ఈ సేమియాతో మనం సేమియా నిమ్మకాయ పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకం చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని కూడా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా నిమ్మకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒక కప్పు, నీళ్లు – ఒక లీటర్, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నిమ్మకాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీడిపప్పు పలుకులు – 15, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ.
సేమియా నిమ్మకాయ పులిహోర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత సేమియాను వేసి నెమ్మదిగా కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ సేమియాను జల్లిగంటెలోకి తీసుకుని వడకట్టుకోవాలి. తరువాత వెంటనే ఈ సేమియాపై చల్లటి నీటిని పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించిన సేమ్యాను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి నెమ్మదిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తరువాత నిమ్మరసం వేసి కింది నుండి పైకి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోర తయారవుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు ముద్దగా ఉన్నా చల్లారే కొద్ది పొడి పొడిగా తయారవుతుంది. ఈ సేమియా పులిహోరను ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఈ వంటకాన్ని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. సేమియాతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులిహోరను కూడా తయారు చేసుకుని తినవచ్చు.