Joint Pains : ఈ రోజుల్లో ఎవరిని చూసినా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధపడుతూ కనిపిస్తున్నారు. అలాగే కొంత మంది యువత పనుల్లో ఉత్సాహం చూపించక వృద్ధుల్లా వెనుకంజ వేస్తున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. తినే ఆహారంలో సారం లేకపోవడం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి వాటిని ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు. విపరీతమైన ఒత్తిడిని తట్టుకోలేక మద్యపానం, ధూమపానం వంటి వాటిని అలవాటు చేసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు అధికమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ జలుబు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఈ రోజుల్లో మందులను వాడుతున్నారు.
ఈ మందుల వాడకం వల్ల దుష్ప్రభావాలు అధికమై ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి కీళ్ల నొప్పులు అధికమవుతున్నాయి. మన పెద్దలు ఆయుర్వేదం, హోమియోపతి ఎంత వాడమని చెప్పినా వినిపించుకోకుండా తాత్కాలిక ఉపశమనాన్ని అందించే ఇంగ్లీష్ మందులను వాడుతూ లేనిపోని అనార్థాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటి కీళ్ల నొప్పులను తగ్గించడంలో మేకపాలు, బెల్లం, నువ్వులు కలిపిన మిశ్రమం దివ్యౌషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి వాటి వల్ల ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారో మన ఇండ్లల్లో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం.
ఇలాంటి నొప్పుల నుండి బయట పడడానికి మందుల వెనుక పరిగెత్తకుండా ఆయుర్వేద విధానాన్ని అవలంభించి ఆ నొప్పులను మటుమాయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో మేక పాలు అద్భుతంగా పని చేస్తాయని నిపుణుల చెబుతున్నారు. మేక పాలల్లో బెల్లం, నువ్వులు కలిపి రోజూ ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల మోకాళ్ల నొప్పులతో పాటు ఇతర కీళ్ల నొప్పులు అన్నీ తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ రెండు పూటలా ఒక గ్లాస్ గోరు వెచ్చని మేక పాలల్లో చిన్న బెల్లం ముక్క, ఒక టీ స్పూన్ నువ్వుల పొడి కలిపి క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల అన్ని రకాల నొప్పులు మటుమాయం అవుతాయి.
మేకపాలల్లో క్యాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మేక పాలను తాగడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి మెండుగా లభించి అరిగిపోయిన కార్టిలేజ్ ను పునరుత్పత్తి చెందేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా అన్ని రకాల కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించే మరిన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం. ఆలివ్ నూనెను వాడడం వల్ల కూడా మనం కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఆలివ్ నూనెకు నొప్పులను తగ్గించే గుణం ఉంది.
ప్రతిరోజూ నొప్పులు ఉన్న చోట ఈ నూనె తీసుకుని రాసి మర్దనా చేయడం వల్ల నొప్పులు ఇట్టే తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో వేడి నీరు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పెద్ద పాత్రలో వేడి నీటిని పోసి నొప్పులు ఉన్న భాగాన్ని నీటిలో ఉంచడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా కీళ్ల నొప్పులను, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల నొప్పుల నుండి ఉపశమానాన్ని పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.