Cold : వాతావరణ మార్పుల కారణంగా మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి కూడా ఒకటి. ఈ సమస్యల కారణంగా ఇబ్బందిపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ వైరల్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడడం వల్ల ఏ పని చేయలేక, నిద్ర సరిగ్గా ఉండక, తీవ్ర అసౌకర్యానికి గురి అవుతూ ఉంటాం. ఈ వైరల్ ఇన్ ఫెక్షన్ ల నుండి బయటపడడానికి ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ప్రతి చిన్న సమస్యకు యాంటీ బయాటిక్స్ ను వాడడం వల్ల మనం అనేక దుష్పభ్రావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
కనుక మనం సహజసిద్ధ మార్గాలను ఎంచుకోవడమే సరైన పద్దతి. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లిని మనం ఎంతోకాలంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. అయితే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లితో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా తీసుకోవాలి. తరువాత వీటిని ఒక కళాయిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు చల్లగా అయిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వెల్లుల్లి మిశ్రమం నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ఔషధం తయారవుతుంది.
దీనిని పెద్దవారు అర టీ స్పూన్ మోతాదులో, పిల్లలు పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ ఔషధాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల సత్వరమే ఉపశమనం కలుగుతుంది.