Black Pepper : మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతోపాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. మిరియాలల పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటి గొప్పతనం తెలుసుకున్న మన పూర్వీకులు మిరియాలను మనం వంటల్లో భాగంగా చేశారు. ఆయుర్వేద వైద్యులు కూడా మిరియాలను అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. మిరియాలను నేరుగా నమిలి తినగలిగిన వారు రోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు మిరియాలను నమిలి మిగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.
మిరియాలను ఏవిధంగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అజీర్తి సమస్యతో బాధపడే వారు మిరియాలను పాత బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడిని వేసి కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు భోజనానికి అర గంట ముందు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని ఒక గ్లాస్ వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
నీటితో కలిపి మిరియాల పొడిని తీసుకోవడం వల్ల అధిక దాహం సమస్య తగ్గుతుంది. తరచూ జలుబు, తుమ్ములు వంటి వాటితో బాధపడే వారు నీటిలో పసుపు, మిరియాల పొడి వేసి మరిగించి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు ఉన్న వారు మిరియాల పొడిని, రాళ్ల ఉప్పుతో కలిపి చిగుళ్లపై ఉంచడం వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నువ్వుల నూనెలో మిరియాలను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి కట్టు కట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మొటిమలతో బాధపడే వారు మిరియాల పొడిని, పసుపుతో కలిపి మొటిమలపై రాయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. సున్నితమైన చర్మం ఉన్న వారు మాత్రం ఈ చిట్కాను పాటించకూడదు. గాయాలు తగిలినప్పుడు మిరియాల పొడిని రాయడం వల్ల రక్తస్రావం తగ్గడంతోపాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. మిరియాలను తినడం వల్ల మేలు కలుగుతుంది కదా వీటిని ఎవరు పడితే వారు తీసుకోకూడదు. కడుపులో మంట, వేళకు ఆహారాన్ని తీసుకోని వారు, అధిక వేడితో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా మిరియాలను ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.