Thummulu : వాతావరణంలో వచ్చే మార్పుల వలన చాల మందిలో తుమ్ములు పదే పదే వస్తుంటాయి.అలాగే డస్ట్ అలర్జీ అలాంటివి ఉన్నా కూడా చాలా మందిని తుమ్ములు ఇబ్బంది పెడతాయి. ఈ కరోనా సమయంలో తుమ్ములు పక్కవారికి కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే తుమ్ములు రాకుండా ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. తుమ్ములను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వలన వెంటనే తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే వెల్లుల్లి కూడా తుమ్ములను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా రోజంతా తాగాలి. ఇలా చేయడం వలన కూడా తుమ్ములు తగ్గుతాయి. యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉండే దాల్చిన చెక్క కూడా తుమ్ములను రాకుండా ఆపడంలో బాగా పని చేస్తుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసుకొని అందులో తేనె కలిపి తీసుకోవడం వలన తుమ్ములు రాకుండా ఉంటాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తేనెలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన కూడా తుమ్ముల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఒకేసారి ఆగకుండా తుమ్ములు వస్తున్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం పొందవచ్చు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాలి. అలాగే ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవడం వలన జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.