Wisdom Tooth Pain : జ్ఞానదంతం నొప్పి అనే సమస్య సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒక వయస్సుకు వచ్చాక జ్ఞాన దంతం పెరిగి నొప్పి కలుగుతుంది. ఇది సరిగ్గా పెరిగితే సమస్య ఉండదు. కానీ జ్ఞానదంతం చాలా మందిలో వంకరగానే పెరుగుతుంది. దీంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఫలితంగా వైద్యుడి వద్దకు వెళ్లి ఆ దంతాన్ని తొలగించుకుంటారు. అయితే వాస్తవానికి దీన్ని తీసేయాల్సిన పనిలేదు. కొంత కాలం వేచి చూస్తే ఆ దంతం అలా సెట్ అవుతుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. కానీ జ్ఞాన దంతాన్ని తీసేయించుకునేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నొప్పిని భరించలేరు కదా. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే.. జ్ఞానదంతం నొప్పి నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..

1. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని బాగా నమిలి మింగాలి. నమిలే సమయంలో వచ్చే రసం నోట్లో అంతటా చేరేలా చూసుకోవాలి. దీంతో పుదీనాలో ఉండే నొప్పి నివారణ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే జ్ఞాన దంతం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. లవంగం నూనె తీసుకుని అందులో కొద్దిగా దూదిని నానబెట్టాలి. గంట పాటు నానబెట్టాక ఆ దూదిని తీసి నొప్పి ఉన్న చోట ఉంచాలి. 10 నిమిషాల పాటు ఉంచితే నొప్పి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకు 3, 4 సార్లు చేయవచ్చు.
3. ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, నొప్పి నివారణ గుణాలు ఉంటాయి. అందువల్ల ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని సగం కట్ చేయాలి. దాన్ని నోట్లో వేసి బాగా నమిలి మింగాలి. నమిలే సమయంలో నొప్పి ఉన్న చోట రసం తాకేలా చూడాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
4. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుంటే జ్ఞానదంతాల నొప్పి నుంచి బయట పడవచ్చు.