Anemia : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. రక్తహీనత సమస్య బారిన పడితే గనుక అది ఇతర అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. ఈ సమస్యలు ఒక్కసారి తలెత్తాయంటే చాలు అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వీటి బారి నుండి బయటపడడానికి మనం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులను వాడడం వల్ల ఉపశమనం ఉన్నప్పటికీ వాటి వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
సహజసిద్ధంగా కూడా ఇలాంటి వాత దోషాలన్నింటి నుండి మనం బయట పడవచ్చు. వివిధ రకాల వాత దోషాలను నయం చేయడంలో మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులు మనందరి వంట గదిలో ఉండేవే. వీటిని ఎంతోకాలంగా మనం వంటల్లో వినియోగిస్తున్నాము. మెంతుల్లో పోషకాలతోపాటు అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాత దోషాలతోపాటు మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా మెంతులు మనకు సహాయపడతాయి.
అయితే మెంతులను ఏవిధంగా తీసుకుంటే మనం అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒక టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తీసుకోవాలి. అలాగే ఈ మెంతులను పడేయకుండా వాటిని మొలకెత్తించి అల్పాహారంలో భాగంగా కూడా తీసుకోవాలి. ఈ మెంతుల నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది.
మెంతుల నీటిని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో కూడా మెంతుల నీరు మనకు ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. యూరిన్ ట్రాక్ ఇన్ ఫెక్షన్ లతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల బ్యాక్టీరియల్, ఈస్ట్ ఇన్ ఫెక్షన్ లు తగ్గి మూత్రాశయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యత, సంతాన లేమి వంటి సమస్యలతో బాధపడే స్త్రీలు ఈ మెంతుల నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మెంతుల నీటిని తాగడంతోపాటు మెంతులను తీసుకోవడం మనల్ని వేధించే అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.