డిజిటల్ రూపంలో సులభంగా డబ్బులు చెల్లించేందుకు ఉపయోగపడేవి డెబిట్, క్రెడిట్ కార్డులు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయడం కన్నా చాలా మంది ఈ రెండు రకాల కార్డులను తీసుకెళ్లి డబ్బు చెల్లిస్తుంటారు. అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డు కచ్చితంగా ఉంటుంది కానీ, క్రెడిట్ కార్డు అందరి వద్దా ఉండదు. ఈ క్రమంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్నవారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ చేస్తే మంచిదో, అసలు ఈ రెండు కార్డుల మధ్య ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయగానే వారు డెబిట్ కార్డు ఇచ్చేస్తారు. దీనివల్ల వినియోగదారులు తమ తమ ఖాతాల్లో ఉన్న డబ్బుకు అనుగుణంగా ఈ డెబిట్ కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. అయితే కొన్ని పాత తరం కార్డులు ఏటీఎం ల నుంచి నగదు విత్ డ్రా చేసుకునేందుకు మాత్రమే పనిచేస్తాయి. అయితే ఇప్పుడు అందిస్తున్న కార్డులు ఏటీఎం కమ్ డెబిట్ కార్డులు అవుతుండడం వల్ల వాటితో ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసుకోవడమే కాదు, డిజిటల్ చెల్లింపులు కూడా చేయవచ్చు. అయితే ఏ చెల్లింపు చేసినా ఖాతాలో డబ్బు ఉన్నంత వరకే డెబిట్ కార్డు వాడగలరు. అయిపోతే వాడలేరు. ఈ క్రమంలో డెబిట్ కార్డుల నిర్వహణకు బ్యాంకులు ఏడాదికి రూ.250 వరకు వసూలు చేస్తాయి.
ఇక క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే ఆదాయం బాగా ఉన్నవారికి, బిజినెస్ చేసే వారికి మాత్రమే బ్యాంకులు ఈ కార్డులను ఇస్తుంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సెక్యూరిటీగా పెట్టుకుని కూడా ఎస్‌బీఐ వంటి బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చినా ఒక్కో కార్డుకు దాని రకాన్ని బట్టి ఒక్కో విధంగా వార్షిక ఫీజు ఉంటుంది. అది కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.10వేల వరకు కూడా ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు వినియోగదారులు మొదటి సంవత్సరం క్రెడిట్ కార్డులు వాడే విధానాన్ని బట్టి రెండో ఏడాది ఫీజును కూడా రద్దు చేస్తుంటాయి.
అయితే క్రెడిట్ కార్డు మాత్రం డెబిట్ కార్డులా కాదు. బ్యాంకు మనకు కొంత నగదును అప్పు రూపంలో ఇస్తుందన్నమాట. అంటే… మీకు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చిందనుకోండి, దానికి క్రెడిట్ లిమిట్ ఇంత మొత్తం అని సెట్ చేసి ఇస్తుంది. ఈ క్రెడిట్ లిమిట్‌ను కార్డులు ఇచ్చే ఆయా బ్యాంకులే సెట్ చేస్తాయి. ఉదాహరణకు రూ.50వేల క్రెడిట్ లిమిట్‌తో మీకు ఏదైనా బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు వచ్చిందనుకోండి. అంత మొత్తం వరకు మీకు బ్యాంకు అప్పు ఇచ్చినట్టు లెక్క. అందుకే దాన్ని క్రెడిట్ కార్డు అంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా మీరు కార్డును వినియోగించిన ప్రతిసారి అయ్యే మొత్తాన్నంతా కలిపి ఒకేసారి నెల చివరన సదరు బ్యాంకు బిల్ పంపిస్తుంది. దాన్ని 10 రోజుల్లో చెల్లించాలి. లేదంటే ఫైన్ బాగా పడుతుంది.
అయితే ఇక్కడ క్రెడిట్ కార్డు వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే… ఉదాహరణకు మీరు నెలలో 1వ తేదీన రూ.20వేలకు ఏదైనా కొన్నారనుకోండి. మీకు బిల్ వచ్చే తేదీ 30 అనుకుంటే… మరుసటి నెలలో 10వ తేదీ వరకు ఆ రూ.20వేలను చెల్లించాలి. అంటే మొత్తం… 30 + 10 = 40 రోజుల వరకు మీరు ఆ రూ.20వేలకు వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. కానీ… ఆ 10 రోజుల గ్రేస్ పీరియడ్‌ను దాటక ముందే బిల్ కట్టాలి. లేదంటే… వడ్డీతోపాటు ఫైన్ కూడా పడుతుంది. కనుక ఈ ఒక్క విషయం గమనించి వాడుకుంటే క్రెడిట్ కార్డుతో లాభమే గానీ నష్టం ఉండదు.
సాధారణంగా ఏ బ్యాంకు అయినా డెబిట్ కార్డులను అంతర్జాతీయ లావాదేవీలకు వీలు లేకుండా బ్లాక్ చేస్తాయి. దీన్ని బ్యాంకుకు వెళ్లి లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజర్ స్వయంగా అన్ బ్లాక్ చేసుకోవచ్చు. ఆ తరువాత సదరు డెబిట్ కార్డును అంతర్జాతీయ సైట్లలోనూ వాడవచ్చు. అయితే క్రెడిట్ కార్డులు అలా కాదు, డిఫాల్ట్‌గా అంతర్జాతీయ సైట్లలో వాడుకునే విధంగానే వస్తాయి. దాన్ని వద్దనుకుంటే యూజర్ స్వయంగా బ్లాక్ చేసుకోవచ్చు. అయితే దేశీయ, విదేశీయ సైట్లు ఏవైనా ఇప్పుడు 3డీ సెక్యూర్ పిన్‌ను కచ్చితంగా ఎంటర్ చేసేలా ఏర్పాట్లు చేశాయి కాబట్టి ఆయా లావాదేవీలకు ఏ కార్డునైనా నిర్భయంగా వాడవచ్చు. కాకపోతే సదరు సైట్లు అసలువా, నకిలీవా అన్నది మాత్రం యూజర్లు నిర్దారించుకోవాలి.
చాలా వరకు ప్రైవేటు బ్యాంకులతోపాటు ఎస్‌బీఐ వంటి బ్యాంకులు కూడా ఇప్పుడు తమ తమ డెబిట్ కార్డులను వాడుతున్న వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, సినిమా టిక్కెట్లు, రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. ఇక క్రెడిట్ కార్డుల్లో ఇవి ఎప్పటి నుంచో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఇలాంటి ఆఫర్లు, పాయింట్లను అందించేలా వినియోదారులు తమకు నచ్చిన కార్డులను ఎంచుకుని తీసుకుంటే ఉత్తమం. దీని వల్ల ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది. అయితే పెట్రోల్ బంక్‌లలో కార్డులను వినియోగించాలనుకుంటే అందుకు ఫ్యుయల్ సర్‌చార్జి వీవర్ అనే ఆప్షన్ ఉన్న క్రెడిట్ కార్డులను తీసుకోవాలి. దీంతో కేవలం ఫ్యుయల్‌కు మాత్రమే డబ్బులు చెల్లిస్తే చాలు. సర్‌చార్జి పడదు. పడినా వెంటనే రిడీమ్ అవుతుంది. అయితే డెబిట్ కార్డుల ద్వారా ఈ సదుపాయం లేదు. ట్యాక్స్ పడుతుంది.
ఈఎంఐ విధానంలో వస్తువులను కొనడమంటే మన ఇండియన్స్ తరువాతే ఎవరైనా. అందుకే ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వారికి కావల్సిన వస్తువులను ఈఎంఐలలో అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు ఉన్న వారికి అలా ఫైనాన్స్ సంస్థల వెనుక తిరగాల్సిన పనిలేదు. నచ్చిన వస్తువు కొనుక్కుని దానికి ఈఎంఐ పెట్టుకుంటే చాలు. ఎంచక్కా నెల నెలా డబ్బు కట్టుకోవచ్చు. బిల్లులో ఈఎంఐ కలిపి వస్తుంది. ఈ క్రమంలో వస్తువును కొనుగోలు చేసేటప్పుడు మర్చంట్ దగ్గర లేదంటే కొన్నాక సదరు క్రెడిట్ కార్డుకు చెందిన బ్యాంకింగ్ సైట్‌లో… రెండు విధాలుగా ఈఎంఐ ను పెట్టుకోవచ్చు.
లేదంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా వారు మీ పర్చేజ్‌ను ఈఎంఐగా మారుస్తారు. అయితే మీరు కొన్న తేదీకి సరిగ్గా నెల రోజులకు మళ్లీ ఈఎంఐ మొత్తం క్రెడిట్ కార్డు బిల్లులో యాడ్ అవుతుంది. కనుక ఆ రోజున క్రెడిట్ లిమిట్ ఈఎంఐ మొత్తానికి అనుగుణంగా ఉండేలా చూడాలి. క్రెడిట్ లిమిట్ ఏమీ లేకుండా ఈఎంఐ మొత్తం బిల్లులో పడితే అప్పుడు ఛార్జి… మీరు ఊహించనంత వసూలు చేస్తారు. కనుక అలాంటి నష్టం జరగకుండా చూసుకుంటే చాలు, క్రెడిట్ కార్డే ఉత్తమమంటారు. ఓవరాల్‌గా చూసుకుంటే… డెబిట్, క్రెడిట్ కార్డు ఏది వాడినా, బడ్జెట్‌కు అనుగుణంగా వాటిని వాడితే మంచిది. లేదంటే ఇబ్బందులు పడక తప్పదు..!
ఇక చివరిగా నగదు విత్ డ్రా. డెబిట్ కార్డులతో ఏ ఏటీఎంలోనైనా నగదు విత్ డ్రా చేస్తే ఎలాంటి చార్జి ఉండదు. అయితే గతంలో ఒక బ్యాంకు ఖాతాదారుడికి ఒక కార్డుకు నెలకు 5 విత్ డ్రాలు ఉచితంగా ఉండేవి. అంతకు మించితే స్వల్ప చార్జి వేసేవారు. కానీ క్రెడిట్ కార్డులతో నగదు విత్ డ్రా చేస్తే మాత్రం గూబ వాచి పోతుంది. ఎందుకంటే వడ్డీ రూ.2.50 లు ఆ పైనే పడుతుంది. అది బిల్ పీరియడ్‌లోగా చెల్లించకపోతే ఇక ఆ తరువాత పడే ఫైన్‌ను చెప్పలేం. కనుక నగదు విత్ డ్రా కోసమైతే డెబిట్ కార్డే బెటర్..!