SPG Commando : ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీ కమాండోల గురించి అందరికీ తెలుసు. ఈ వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భద్రత అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి ప్రధాని భద్రత బాధ్యతలను ఎస్‌పీజీయే పర్యవేక్షిస్తోంది. ఇందిరా గాంధీ హత్య తరువాతే ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు.
ఇక ఎస్‌పీజీలో పనిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఏమీ ఉండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లకు చెందిన సీనియర్, జూనియర్ ఆఫీసర్లను ఎస్‌పీజీలోకి తీసుకుంటారు. వారికి రాటుదేలేలా శిక్షణను అందించి తరువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎస్‌పీజీలో 3వేల మందికి పైగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇక ఒక్కో ఎస్‌పీజీ అధికారి కేవలం ఒక ఏడాది పాటు మాత్రమే విధి నిర్వహణలో ఉంటాడు. తరువాత మార్చేస్తారు. ఎస్‌పీజీలో ఒక ఏడాదిపాటు పనిచేశాక ఇతర విభాగాలకు మారుస్తారు. ఎస్‌పీజీలో పనిచేయడం అంటే ప్రధాని మోదీకి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కనుక చాలా మెరికలైన కమాండోలనే అందుకు నియమిస్తారు. ఎటు వైపు నుంచి ఆపద వచ్చినా ఇట్టే పసిగట్టి ప్రధాని ప్రాణాలను రక్షించేందుకు వీరు ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు.
ఎస్‌పీజీ కమాండోలు ప్రధానితోపాటు ఆయన ఇల్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తారు. ఒక్కో ఎస్‌పీజీ కమాండోకు ఎప్పుడూ ఒకటే డ్యూటీ ఉండదు. తరచూ మారుస్తుంటారు. ఇక వీరి వేతనం విషయానికి వస్తే వీరికి అన్ని రకాల అలవెన్స్‌లు కలిపి నెలకు రూ.84వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనం ఉంటుంది. బోనస్ , ఇతర అలవెన్స్‌లు, సదుపాయాలను కూడా కల్పిస్తారు. వీరికి డ్రెస్ అలవెన్స్ కింద ఏడాదికి రూ.27,800 ఇస్తారు. ఇలా ఎస్‌పీజీ కమాండోలు పనిచేస్తుంటారు.