మీ ఇంట్లో ఉండే టీవీ, కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడై పోయాయా..? చాలా రోజుల నుంచి వాటిని ఉపయోగించడం లేదా..? ఇక చెత్త బుట్టలోకే వాటిని పంపేయాలని నిర్ణయం తీసుకున్నారా..? అయితే కొంత కాలం ఆగండి..! ఎందుకంటే వాటికి మంచి ధర వచ్చేందుకు అవకాశం ఉంది. అదేంటీ, పాడై పోయి పనికి రావని అనుకునే వస్తువులకు మంచి ధర రావడమేమిటి..? అని అనుకుంటున్నారా..? అయినా, మేం చెబుతోంది నిజమే. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి… టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్ పీసీలలో సర్క్యూట్ బోర్డ్‌లు ఉంటాయి కదా. అవును, ఉంటాయి. వాటిలో బంగారం రంగులో ఉండే చిన్నపాటి, సన్నని తీగలు, వైర్లు బోర్డుల్లో ఇమిడిపోయి సర్క్యూట్‌ల మాదిరిగా ఉంటాయి.
అయితే వాటి తయారీకి ఏటా ఎంత బంగారం అవసరం అవుతుందో తెలుసా..? అక్షరాలా 300 టన్నులు. అవును, మీరు విన్నది కరెక్టే. అయ్య బాబోయ్ అంత బంగారమే, అని ఆశ్చర్యపోతున్నారా..? అవును, మీరు ఆశ్చర్యపోయినా అంతే స్థాయిలో బంగారాన్ని ఉపయోగించి ఏటా ఆయా సర్క్యూట్ బోర్డులు తయారు చేస్తున్నారు. ఈ బంగారం వాటా మొత్తం బంగారంలో 7 శాతం వరకు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే అంత మొత్తంలో బంగారం ఉపయోగించి తయారు చేసిన బోర్డులు కొంత కాలం మాత్రమే పనిచేస్తాయి. అనంతరం వ్యర్థం రూపంలో మారిపోతుంది. దీంతో విలువైన బంగారాన్ని కోల్పోవాల్సి వస్తుందని భావించిన పలు కంపెనీలు ఆ గోల్డ్‌ను మళ్లీ వెలికి తీసేందుకు ఒకప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి.
అయితే అప్పట్లో ఆ బంగారం వెలికితీత కోసం సయనైడ్ వంటి విషపూరితమైన కెమికల్స్ ఉపయోగించాల్సి వచ్చేది. కాగా అలాంటి కెమికల్స్ అవసరం లేకుండా పూర్తిగా సురక్షితమైన పద్ధతిలో, పర్యావరణ హితంగా ఉండేలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్‌ల నుంచి బంగారాన్ని వెలికితీసే ఓ కొత్త పద్ధతిని పలువురు సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు పైన చెప్పిన బంగారం వెలికి తీత నూతన పద్ధతిని ఇటీవలే కనుగొన్నారు. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. అంతేకాదు, పూర్తిగా సురక్షితమైన పద్ధతిలో సర్క్యూట్ బోర్డ్‌ల నుంచి బంగారాన్ని వెలికి తీయవచ్చు. ఒక ప్రత్యేకమైన యాసిడ్‌లో ముందుగా ఆయా బోర్డ్‌లను ఉంచుతారు.
దీంతో వాటిలో ఉండే లోహమంతా యాసిడ్‌లో కరుగుతుంది. తరువాత ఆ యాసిడ్‌కు కొన్ని పదార్థాలు కలుపుతారు. అనంతరం దాన్నుంచి బంగారాన్ని సేకరిస్తారు. ఈ పద్ధతి వల్ల బంగారం రీసైకిల్ చేసినట్టు అవుతుంది. కొత్తగా బంగారాన్ని వాడాల్సిన పనిలేదు. ఎన్నో వందల టన్నుల బంగారాన్ని ఆదా చేసినట్టు అవుతుంది. అయితే ఈ నూతన పద్ధతిపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని, అవి పూర్తయితే త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన జాసన్ లవ్ తెలుపుతున్నారు. కాబట్టి, మీ ఇంట్లో ఉన్న పాత ఎలక్ట్రానిక్ వస్తువులను పారేయకండి. ఇంకొన్ని రోజులు ఆగితే ఎంచక్కా వాటిని మంచి ధరకు అమ్ముకోవచ్చు.