అదేమీ ఉండదు, కాకపోతే కొన్నాళ్ళు ఒక పరాజిత దేశంగా నింద భరిస్తూ పునర్నిర్మాణ దిశగా వెళుతుంది. గల్ఫ్ యుద్ధం( 1991) లో చిత్తుగా ఓడిన దాని పొరుగు దేశం ఇరాక్ చరిత్రలో జ్ఞాపకంగా మారిందా? సద్దాం హుస్సేన్ అనే నియంత చెప్పు చేతల్లో నాలుగు దశాబ్దాలు నలిగిన ఇరాక్ చివరికి అతని కబంధ పాలన నుంచి విముక్తమై ఊపిరి పీల్చుకుంది, అరబ్ ఆత్మగౌరవ నినాదం మాటున ప్రజల ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే కుహనా పాలన సాగించాడు. అంతిమంగా నాగు పాము తన పిల్లలని తానే తినేసినట్టు పక్కనే ఉన్న తోటి స్వతంత్ర అరబ్ దేశం కువైట్ మాదే ! అంటూ మింగేయాలని కలలు కన్నాడు, దాంతో అతని అరబ్ ఆత్మ గౌరవ సెంటిమెంటు డొల్ల తనం బయట పడింది, అమెరికా నాయకత్వంలో సంకీర్ణ సేనలు సద్దాం సైన్యాన్ని మట్టుబెట్టి కువైట్ సార్వభౌమత్వాన్ని కాపాడాయి. ఈ యుద్ధ క్రతువులో లక్షల మంది బలై పోయారు.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక శక్తిగా ఇరాక్ ని మలచి మురిసిపోయాడు, ఇక అదే బలంతో ఇరుగు పొరుగు దేశాలపై విరుచుకు పడ్డాడు, సద్దాం దుర్మార్గంగా చేసిన దుస్సాహసాలు రెండు గల్ఫ్ యుద్ధాలుగా చరిత్ర పుటల్లోకి ఎక్కాయి! ఆఖరి రోజు వరకూ విజయం మనదే … మనదే అంటూ సద్దాం జమానా ఇరాక్ ప్రజలకు కిర్రెక్కించి నమ్మ బలికింది, తీరా మర్నాడు సంకీర్ణ సేనలు బాగ్దాద్ లోకి ప్రవేశించే సరికి…అరబ్ వీరులారా, పౌరుషం చూపండి, శత్రువుని తరిమి గొట్టండి! అని టీవీల్లో రికార్డెడ్ పిలుపులు ఇచ్చాడు, క్లైమాక్స్ లో సద్దాం ఆర్మీ లొంగిపోయి తెల్లజెండా ఎత్తగా సద్దాం ప్రాణభయంతో పల్లెటూరికి పారిపోయి ఒక కలుగులో దాక్కున్నాడు. గాలించి గాలించి ఆచూకీ కనుగొని సద్దాంని ఉరి తీశారు. ఇప్పుడు ఇరానీ పాలకులు కూడా మొండిగా ముందుకు వెళితే అమెరికా నేతృత్వంలో ఇజ్రాయెల్ మిలిటరీ విజృంభించి ఇరాన్ ను జయించడం ఖాయమని సంకేతాలు సూచిస్తున్నాయి.
అమెరికా తన బలీయమైన మిలటరీ సాధన సంపత్తి నుంచి మొదటి సారి అతి శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబుల్ని బయటకు తీసింది, వాటిని ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ అణు పరిశోధన స్థావరాలపై జారవిడిచింది, ఇవి ఆకాశం నుచి భూగర్భ నిర్మాణాలపై పడి లోతుగా చీల్చుకు వెళ్లి సర్వ నాశనం చేస్తాయి, ఇప్పటికే ఆరు స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో మరే దేశం వద్ద ఇంతటి అత్యాధునిక బస్టర్ బాంబులు లేవు! దీనంతటికీ ఇరాన్ చేపట్టిన వినాశకర రహస్య న్యూక్లియర్ ప్రొగ్రాం ఎజెండా కారణం, అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ దుంప తెంచుతామని బెదిరిస్తే, ఉనికి కోసం ఎదురు దాడి చేయరా? అణు స్థావరాలను ధ్వంసం చేయకుండా ఊరుకుంటారా? తొమ్మిది కోట్ల ఇరాన్ ప్రజల కష్టార్జిత సంపదని ఇలా హేతుబద్ధం కాని , విరోధుల్ని పెంచే అణ్వాయుధాల తయారీకి ఖర్చు పెట్టమని అధికారం ఎవరిచ్చారు?
అదేమీ లేదని పైకి చెబుతూ గోప్యత పాటించడం ఎందుకు? అందుకే ఇరాన్ కాకుండా ప్రపంచంలో ఉన్న 56 ఇస్లామిక్ దేశాల్లో ఒక్కటి కూడా మద్దతు ఇవ్వడం లేదు. పూర్తిగా శాంతియుత ప్రయోజనాలకే న్యూక్లియర్ విజ్ఞానాన్ని ఉపయోగిస్తే కాదనేది ఎవరు? అయితే ఇరాన్ ఎన్నో వేల సంవత్సరాల ప్రాచీన సంస్కృతి, చరిత్ర గల మహోన్నత పర్షియన్ దేశం, చరిత్రలో దురాక్రమణలు, పరాయి పాలనలు ఈ దేశానికి కొత్త కాదు, దాని ప్రస్తుత పాలకులు వారి దుర్విధానాల కారణంగా ఇప్పుడు ఓడిపోవచ్చు గానీ, ప్రజలు పరాజితులు అయినట్టు కాదు, ఓడిపోయిన పక్షంలో కొత్త పాలక మండలి ఏర్పడుతుంది, శిథిలాల నుంచి ఇరాన్ తప్పక పైకి లేస్తుంది.