బ్లేడ్లను మగవారు షేవింగ్ కోసం వాడుతారు కదా. కేవలం ఆ ఒక్క పనే కాదు, చాలా మంది బ్లేడును ఇంకా చాలా రకాలుగా వాడుతారు. అది సరే. ఇంతకీ ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా..? అక్కడికే వస్తున్నాం. బ్లేడును మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా..? అదేం ప్రశ్న, దాన్ని చూడని వారు ఎవరుంటారు..? అని అనకండి. ఎందుకంటే బ్లేడును జాగ్రత్తగా గమనిస్తే మనకు ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే… బ్లేడు మధ్యలో ఓ వినూత్నమైన ఆకృతి ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అయితే అసలు ఆ ఆకృతి ఎలా వచ్చిందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1904వ సంవత్సరంలో జిలెట్ కంపెనీ బ్లేడును తయారు చేసింది. అప్పుడు బ్లేడ్లు వేరే టైప్‌లో ఉండేవి. మధ్యలో కేవలం 3 రంధ్రాలు మాత్రమే ఉండేవి. అవి కూడా రేజర్లను పెట్టుకునేందుకు అనువుగా ఉండేలా ఆ రంధ్రాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో జిలెట్ కంపెనీ తాను తయారు చేసిన బ్లేడ్లకు పేటెంట్ హక్కులు తీసుకుంది. దీంతో దాన్ని కాపీ కొట్టి ఎవరూ అలాంటి బ్లేడ్లను తయారు చేయలేకపోయారు. ఈ క్రమంలో 25 ఏళ్లకు సదరు పేటెంట్ ఎక్స్‌పైర్ అయింది. దీంతో హెన్రీ జె. గైస్‌మన్ అనే వ్యక్తి కొత్త కంపెనీ పెట్టి బ్లేడ్లను తయారు చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆ బ్లేడ్ల డిజైన్ ఇప్పటి బ్లేడ్లను పోలి ఉండేది. ఈ క్రమంలో ఆ బ్లేడ్లలో జిలెట్ రేజర్లు కూడా పట్టేలా హెన్రీ బ్లేడ్లను తయారు చేశాడు. అయితే హెన్రీ తయారు చేయించిన రేజర్లు మాత్రం జిలెట్ బ్లేడ్లలో పట్టేవి కావు. ఎందుకంటే వాటిని తమ బ్లేడ్లకు అనువుగా హెన్రీ తయారు చేయించాడు. దీంతో జిలెట్ కంపెనీకి పెద్ద షాక్ తగిలింది.
ఈ క్రమంలోనే జిలెట్ కంపెనీ కూడా సరిగ్గా అలాంటి రేజర్లనే తయారు చేయడం మొదలు పెట్టింది. అలా ఇప్పుడున్న లాంటి బ్లేడ్ల తయారీ షురూ అయింది. అయితే బ్లేడ్లకు అదే డిజైన్ పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేమింటే… బ్లేడుకు రెండు వైపులా పదును ఉంటుంది కదా. ఈ క్రమంలో అది ఎటు వైపు అయినా సరిగ్గా వంగడానికి, మంచి గ్రిప్ కోసం, సులభంగా వాడుకోవడం కోసం కూడా బ్లేడ్లలో ఆ డిజైన్ పెట్టడం ప్రారంభించారు. అదీ… బ్లేడ్ డిజైన్ వెనుక ఉన్న అసలు కారణం..!