చాలు, ఇక చాలు…. నే పడ్డ మనోవేదనకు, అనుక్షణం నే అనుభవిస్తున్న నరకయాతనకు.. ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఎలా మరువగలను అతనిని….? నేనే తన సైన్యం, సర్వస్వమని నమ్మిన అతనిని కాదని ఎలా బతకగలను? బలవంతంగా సొంతం చేసుకోవాలనుకుంటున్న నీ ప్రయత్నాలు ఆపు ఇక…అలసిపోయాను, విసిగిపోయాను…!! ఇప్పటి వరకు నా అంతకు నేనే ఓడిపోతూ, ఎన్నో విమర్శలను దిగమింగుతూ…. నిన్ను గెలిపించాలనే ప్రయత్నాలు చేసి,…. తప్పు చేశాననే భావన కలగకముందే., అర్థం చేసుకొని హుందాగా వ్యవహరించి తప్పుకుంటావని ఆశిస్తున్నాను. ఎందుకంటే….నిజంగా ప్రేమించడమంటే…మనం ప్రేమించిన వారి అభిప్రాయాలకు విలువనివ్వడమే….. వారు ఎలా అయితే కోరుకుంటున్నారో అలా ఉండనివ్వడమే…. నా మోములో చిరునవ్వు, నా హృదయంలో ఆనందం అతడితోనే… అది తెలిసి కూడా నీ ఈ ప్రవర్తన చాలా బాధాకరం .!! నేను తెలిసి చేసిన పొరపాట్లుంటే క్షమించు…కానీ బాధించకు.!!!
ఒక్కమాటలో కాదు అనుకుంటే తెగిపోయే బంధమా అది….!? చిన్ననాటి స్నేహం, ఎన్నో జ్ఙాపకాలు కలగలిసిన బంధం, ఒకరంటే ఒకరికి స్పూర్తి, ఒకరు లేకుంటే మరొకరు లేరనే అనురక్తి మా సొంతం. ఎలా కాదనగలను చిన్న చిన్న గొడవల్లో అతనిపై నే సాధించిన పైచేయిని…ఎలా కాదనగలను… ఎన్నో చిలిపి పనుల ఆనందాన్ని….. కలిసి తిరిగిన గుడులు, కలగలిసి గడిపిన రోజులు…ఇలా అతని ప్రతి జ్ఙాపకం నన్ను వెంటాడుతుంటే….నేను నీ జంటగా ఎలా రాగలను, ఎలా ఉండగలను !?
జనవరి ఫస్ట్ మొదలు….క్రిస్ మస్ వరకు అతడిచ్చిన ప్రతి గిఫ్ట్ వెనుక ఓ మధురానుభూతి. ఒక్కసారి తరచి చూస్తే తెలుస్తుంది అతనికి నామీదున్న ప్రేమతడి.!! పొరలు పొరలుగా అల్లుకొని….ఆసాంతం నన్ను అల్లేసింది. అందుకే ఆ బంధం వీడదు…నా ప్రాణం పోయే వరకు అది శాశ్వతం.
నా చెవ్వుల్లో అతడి స్పూర్తివంతమైన మాటలు మారు మోగుతుంటే… నా గుండెల్లో సైతం నువ్వు సాధించగలవు అంటూ అతడు నింపిన ఆత్మవిశ్వాసం కదలాడుతుంటే…. నాకు తెలియకుండానే నా ప్రతి కదలికను తానే నియంత్రిస్తుంటే…. నీ వైపుగా నా అడుగు ఎలా వేయగలను? నీ మేలు కోరి నే చేసిన ప్రతి పనిని తప్పుగా భూతద్దంలో చూడకు, నన్ను నన్నుగా వదిలేయ్…నన్ను నన్నుగా బ్రతకనివ్వు…. నాగరికత గల వ్యక్తిగా…ప్రేమను గెలిపించే వ్యక్తిగా… అన్నింటికి మించి నీలోని మంచి మనిషిగా….ప్లీజ్ మమ్మల్ని దీవించు.