ఎవరికైనా జీవితంలో విజయం అనేది అంత సులభంగా రాదు. ఎన్నో కష్టాలు పడాలి. శ్రమకోర్చాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. ఓటముల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయశిఖరానికి చేరుకోవాలి. అయితే విజయం సాధించాలన్నా, విజయవంతమైన వ్యక్తులుగా మారాలన్నా.. అందుకు కింద చెప్పిన సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలి. దీంతో ఎవరికైనా విజయవంతమైన వ్యక్తులుగా మారడం చాలా సులభతరమవుతుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. చాలా మంది తాము చేయాలనుకున్న పనులను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. రేపు, ఎల్లుండి, వచ్చేవారం.. అంటూ పనిని పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఆ వైఖరి మార్చుకోవాలి. రేపు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. అంతేకానీ వాయిదాలు పనికిరాదు.
2. నేటి ఆధునిక యుగంలో చాలా మంది చాలా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. రాత్రి పొద్దు పోయే వరకు మెళకువతో ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మాయలో పడి నిద్ర ఆలస్యంగా పోతున్నారు. ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. నిజానికి విజయవంతమైన వ్యక్తులుగా మారాలంటే ఇలాంటి అలవాట్లను మానుకోవాలి. రాత్రి చాలా త్వరగా పడుకుని తెల్లవారుజామునే నిద్రలేవాలి. విజయవంతమైన వ్యక్తులుగా మారిన వారందరూ ఉదయం పూట చాలా త్వరగా నిద్ర లేచేవారే. కనుక ఎవరైనా ఈ అలవాటునే పాటించాలి. దీంతో విజయం సాధించాలనుకునే మార్గంలో ఒక మెట్టు పైనే ఉంటారు.
3. కొందరు అవసరం లేకపోయినా ఏదో ఒకటి ఎడా పెడా మాట్లాడుతూనే ఉంటారు. అలా ఉండకూడదు. అవసరం ఉంటేనే మాట్లాడాలి. సైలెంట్‌గా పనిచేయాలి. విజయం తీరాలను చేరుకోవాలి.
4. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం బాగుంటేనే ఎవరైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని సాధించగలుగుతారు. కనుక విజయవంతమైన వ్యక్తులుగా మారాలనుకునే వారు నిత్యం వ్యాయామం, యోగా చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.
5. కొందరు విజయం సాధించాలనుకునే తపనలో ఓటములను ఎదుర్కొంటూ డీలా పడిపోతుంటారు. అలా ఉండరాదు. ఓటముల నుంచి పాఠాలను నేర్చుకుని వాటికి భిన్నంగా మరో మార్గంలో విజయం దిశగా ముందుకు సాగాలి. ఓటములు కలుగుతున్నాయని దిగులు చెందకుండా వాటిని స్ఫూర్తిగా తీసుకుని విజయం దిశగా వెళ్లాలి.
6. విజయవంతమైన వ్యక్తులుగా మారాలనుకునే వారు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే తమకు అవసరం అనుకున్న ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. ప్రతి అంశంపై సునిశిత దృష్టి పెడుతూ అవగాహన కల్పించుకోవాలి. సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి.
7. ఒకేసారి విజయం వైపు వెళ్లి ఓటమి చెందకుండా నెమ్మదిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ స్వల్పకాలిక లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధిస్తూ ముఖ్య లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలి. విజయం అంత సులభంగా వరించదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాలి.
8. విజయం సాధిస్తామనే నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ అధైర్య పడకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. ఇతరులకు ప్రేరణగా ఉండాలి. ప్రేరణాత్మకమైన మాటలను చెప్పాలి.
9. విజయం సాధించాలనుకునే వారికి డబ్బు కూడా ముఖ్యమే. కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర, దుబారా ఖర్చులు చేయరాదు. డబ్బు చాలా విలువైందన్న సత్యాన్ని గ్రహించాలి.
10. కొన్ని కొన్ని సార్లు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా స్వీకరించి ముందుకు సాగాలి. డీలా పడితే విజయం సాధించలేమని గుర్తుంచుకోవాలి.
11. అప్పుడప్పుడు మనకు అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి. వాటిని గుర్తుంచుకునేందుకు రాసి పెట్టుకోండి. తరువాత మీకు అవి ఉపయోగపడతాయి.
12. ఎవరైనా హేళన చేస్తారని, నవ్వుతారని కొందరు తమ తమ హాబీలను నెరవేర్చుకునే ప్రయత్నంలో వెనుకడుగు వేస్తుంటారు. అలా కాకుండా మీ హాబీలను కచ్చితంగా ఫాలో అవ్వండి. విజయవంతమైన వ్యక్తులుగా మారాలనుకునేవారు తమ హాబీలను అణచుకోవాల్సిన పనిలేదు. నిజానికి అవే విజయానికి దోహదపడతాయి.
13. విజయవంతమైన వ్యక్తులుగా మారాలనుకునేవారు లక్ష్యాలను చేరుకోవడంలో స్థిరత్వం ప్రదర్శించాలి. ఎప్పుడూ విజయంపై నమ్మకం ఉంచి స్థిరంగా ఉంటే.. కచ్చితంగా విజయం వరిస్తుంది.