పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త తన కంటే చదువులో, ఉద్యోగంలో, హోదాలో, ఎత్తులో, బరువులో ఎక్కువుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రకమైన ధోరణి వారికి ఒక విధమైన emotional సపోర్ట్ లేదా సాంఘిక పరమైన రక్షణ అనుభూతిని కలగచేస్తోంది అనుకోవాలి. తనకంటే తక్కువ చదువు, ఉద్యోగం, హోదా ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం అమ్మాయిలలో చూడడం సాధారణంగా జరగదు. ఆడవారు తమకి తెలియకుండానే భర్తకి తన కంటే ఒక ఉన్నత స్థానాన్ని మానసికంగా ఊహించుకుని ఆ ఉహలో ఒక భద్రతా భావాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు. అయితే ఆడవారిలో ఈ రకమైన ప్రవ్రుత్తి కారణంగా నేను ఎక్కువ అనే భావం మగవారిలో ఉండడం ఆశ్చర్యం లేదు. మగవారిలో నేను ఎక్కువ అనే భావం పర్యవసానాలు ఆడవారికి అనుకూలంగా ఉండవు.
ఆడవారికి ఉద్యోగంతో వచ్చిన ఆర్ధిక స్వేచ్చ, పరిచయాలు , గౌరవం ఇవన్ని వ్యక్తిగత మానసిక సున్నితత్వాన్ని పెంచేలా చేస్తాయి. దీని మూలంగా ఇంతవరకు భర్తకి తనకంటే ఆపాదించిన ఉన్నత స్థానాన్ని యివ్వడంలో కొంత తగ్గుదల మొదలవుతుంది. ఈ విషయాన్ని భర్తలు సానుకూలంగా తీసుకోలేరు. ఇది ఇద్దరి మధ్యన మనస్ఫర్ధలకి, విడాకులకు కారణం అవుతుంది. అలాగే చదువుకుని ఉద్యోగం చేస్తున్న పెళ్ళైన ఆడవారు తమ సాంప్రదాయకమైన విధుల్లో అంటే పిల్లల సంరక్షణ , ఇంటి బాధ్యతలలో ఇదివరకులాగా నిర్వర్తించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేని భర్తలు తమ వంతు సహకారం అందించ లేకపోవడం విడాకులకి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది.
జీవితంలో విజయం సాధించిన మగవారితో పోలిస్తే చదువు ఉద్యోగం ఉన్న ఆడవారు విడాకులు కావాలని కోరుకోవడం ఎక్కువుగా చూస్తున్నాము. ఆడవారు తమ వ్యక్తిగత జీవితాల విజయాన్ని కుటుంబ వ్యవస్థకి అవరోధం లేకుండా రెండింటిని సమన్వయము చేసుకోగలుతున్నారా? సంపాదించుకున్న సాధికారత నిలుపుకోవడం కోసం సంసారాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం వస్తోందా? ఈ విషయం లో మగవారిదే తప్పు అని ఆడవారు, ఆడవారిదే తప్పు అని మగవారు వాదించుకుంటూ నేర్చుకోవాల్సిన విషయాలు పక్కదారి పడుతున్నాయి.
ఆడవారికి భర్తలు అన్నింటా తమకంటే అధికులుగా వుండాలి కాని ఆధిపత్యం ప్రదర్శించకూడదు. మగవారికి భార్యలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించాలి, కాని వారు తమ సాంప్రదాయక విధులు నిర్వర్తిస్తూ పురుషాధిఖ్యతను గౌరవించాలి. అవ్వ కావాలి బువ్వ కావాలి.. అన్నట్లుగా ఇద్దరూ ప్రవర్తిస్తుంటారు. కనుకనే విడాకులు అధికం అయ్యాయి అని చెప్పవచ్చు.