ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తమ కుటుంబాలకు మూడు పూటల అన్నం పెట్టేందుకు కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, పిల్లులకు ఆహారంగా పక్కన పడేసే కోడి కాళ్లు వండుకుని తినాలని, దానిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు పోషకాహార సూచన చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతోన్న దేశాలలో ఈజిప్ట్ కూడా ఒకటి. చాలా మంది వ్యక్తులకు ప్రస్తుతం నిత్యావసరాలైన వంటనూనె, చీజ్ వంటివి కొనలేని లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి. కొన్ని ఉత్పత్తుల ధరలు నెలల వ్యవధిలోనే రెండింతలు, మూడింతలు పెరిగిపోయాయి.
‘‘నేను నెలలో ఒకసారి మటన్ తింటాను లేదంటే అసలు కొనను. కానీ, వారంలో ఒకసారైనా చికెన్ తింటాను’’ అని ముగ్గురు పిల్లల తల్లి వేదాద్ చెప్పారు. కానీ, ఇటీవల కాలంలో ఒక్క గుడ్డు ధర కూడా 0.16 డాలర్లు అంటే రూ.13కి పైగా పెరిగిపోయినట్లు తెలిపారు. దీనికి కారణం ఈజిప్ట్ ఎక్కువగా ఆహార వస్తువుల దిగుమతులపైనే ఆధారపడటం. 10 కోట్ల మందికి పైగా ఉన్న తన జనాభాకు ఈజిప్ట్ తన దేశంలో పండే ఉత్పత్తుల కంటే ఎక్కువగా పక్క దేశాల నుంచే ఆహార వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. తమ దేశంలో కోళ్లకు అందించే మేతను కూడా ఇతర దేశాల నుంచే సరఫరా చేసుకుంటోంది.
గత ఏడాది 12 నెలల కాలంలో ఈజిప్టియన్ పౌండ్ విలువ డాలర్‌తో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. జనవరిలో ప్రభుత్వం తన కరెన్సీని మరోసారి డివాల్యూ చేసినప్పుడు, దిగుమతుల వ్యయాలు భారీగా పెరిగాయి. 2011లో ఈజిప్ట్‌లో నెలకొన్న తిరుగుబాటు, వేగంగా పెరిగిన జనాభా వంటి కారణాలతో ప్రస్తుతం దేశం ఈ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోందని అంటున్నారు. అలాగే కరోనా మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధం వంటివి కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు.