High BP : నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. దీనికి తోడు రోజూ పలు సందర్భాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లు, అసమయ భోజనాలు, శారీరక శ్రమ లేకపోవడం.. వంటి కారణాల వల్ల కూడా బీపీ వస్తోంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతోంది. అయితే బీపీ.. అంటారు కానీ.. వాస్తవానికి అది ఎంత ఉండాలి ? ఎంత వరకు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు ? బీపీ రీడింగ్ ఎంత మేర ఉంటే హైబీపీ అని పిలుస్తారు ? వంటి అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. ఈ క్రమంలోనే ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ 120/80 అంతకన్నా తక్కువగా ఉంటే బీపీ సాధారణంగానే ఉందని అర్థం. అంటే ఆరోగ్యవంతులు అని అర్థం చేసుకోవాలి. అదే 120/80 కన్నా ఎక్కువగా 139/89 కన్నా తక్కువగా ఉంటే అది రిస్క్ జోన్ అని అర్థం. అంటే ఇలాంటి వారు జాగ్రత్తలు పాటించకపోతే అది హైబీపీకి మారే అవకాశాలు ఉంటాయి. కనుక బీపీ చెక్ చేయించుకున్నప్పుడు రీడింగ్ ఇలా వస్తే జాగ్రత్త పడాలి.
ఇక బీపీ 139/89 కన్నా ఎక్కువగా ఉంటే అది హైబీపీ అని అర్థం. అయితే డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు బీపీ రీడింగ్ ఇలా చూపిస్తే వారు వెంటనే ట్యాబ్లెట్లను రాయరు. కొన్ని రోజులు పరిశీలిస్తారు. ఆ తరువాత కూడా బీపీ రీడింగ్ ఇలాగే నమోదవుతుంటే.. అప్పుడు హైబీపీగా నిర్దారిస్తారు. దీంతో వారు సూచించిన మేర మందులను వాడాల్సి ఉంటుంది. ఇక హైబీపీ ఉన్నవారు ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు, క్యాబేజీ, టమాటాలు, యాపిల్స్, కోడిగుడ్లు, నట్స్, చేపలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి ఆహారాలను రోజూ తినాలి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా బీపీ నియంత్రణలోకి వస్తుంది.
బీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు రోజూ సరైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. వ్యాయామం చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం. రోజుకు కనీసం 7 గంటల పాటు అయినా సరే నిద్రపోవాలి. అలాగే కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే రోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. పుస్తక పఠనం చేయడం, ఇష్టమైన సంగీతం వినడం, పచ్చని ప్రకృతిలో రోజూ కాసేపు గడపడం వంటివి చేస్తే.. బీపీ దానంతట అదే అదుపులోకి వస్తుంది. ఇలా హైబీపీ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.