Dengue Symptoms : ప్రస్తుత తరుణంలో డెంగ్యూ జ్వరం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా మంది ప్రజలు ఇంకా దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే డెంగ్యూ జ్వరం అన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకున్నపుడు సమస్య తీవ్రం అవకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు.
డెంగ్యూ వైరస్ ను కలిగి ఉండే దోమలు మనుషులను కుట్టినపుడు దాని ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్ ను డెంగ్యూ జ్వరంగా ప్రంపచ ఆరోగ్య సంస్థ అభివర్ణిస్తుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే కొన్ని ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర అనారోగ్యంతో మొదలై ప్రాణాంతకంగా పరిణమిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా డెంగ్యూ జ్వరానికి నిర్ధిష్టమైన చికిత్స కూడా లేదని వివరిస్తున్నారు.
అయితే మొదటి దశలోనే గర్తించి తగిన వైద్యం ఇంకా మందుల ద్వారా డెంగ్యూ తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకోగలమని సూచిస్తున్నారు. ఇక ఈ డెంగ్యూని మోసుకొచ్చే దోమలు నలుపు రంగులో తెల్లని చారలతో ఉంటాయి. వీటినే వాడుక భాషలో టైగర్ దోమలని పిలుస్తారు. ఇవి రాత్రి పూట కాకుండా పగటి వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఇది మనిషిని కుట్టినప్పుడు దాని ద్వారా మనిషికి డెంగ్యూ వైరస్ సంక్రమిస్తుంది. అంతటితో ఆగకుండా మనిషి శరీరంలో తన సంఖ్యను, బలాన్ని పెంచుకుంటూ పోవడం జరుగుతుంది.
డెంగ్యూ మనిషి శరీరంలో మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో జ్వరం రావడం జరుగుతుంది. ఆ తరువాత డెగ్యూ లక్షణాలు మొదలవుతాయి. మూడో దశలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. అయితే వీటిలో రెండవ దశ అత్యంత కీలకమైనదని వైద్యులు చెబుతున్నారు.
విపరీతమైన కీళ్ల నొప్పులతో మొదలై రెండవ దశలో కాలేయంలో వాపు రావడం వలన వికారం, వాంతులు లాంటి సమస్యలు కలుగుతాయి. దీని వలన ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కాబట్టి రోగికి పండ్ల రసాలు, కూరగాయలు వంటి బలవర్ధకమైన ఆహారాలను ఇస్తూ ఉండాలి. ఇలాగే ఆగకుండా వాంతులు అవుతున్నప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే డెంగ్యూ సోకినట్టుగా నిర్థారించుకొని సదరు రోగిని ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం ఉంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పడు వారికి ఐవీ ద్రవాలను ఇస్తూ కాపాడవచ్చని చెబుతున్నారు.
అయితే 48 గంటల తరువాత కూడా సాధారణ జ్వరం తగ్గని పరిస్థుతుల్లో రక్తాన్ని పరీక్ష చేసినప్పుడు మాత్రమే డెంగ్యూ అని నిర్థారించ గలమని అంటున్నారు. రక్త పరీక్ష చేసినప్పుడు అందులో ఉండే ప్లేట్ లెట్స్ అనే కణాల సంఖ్య తగ్గుదలను బట్టి డెంగ్యూ ఫీవర్ గా నిర్ణయిస్తారని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. డెంగ్యూ సోకినప్పుడు ఆరోగ్య స్థితిని తెలపడంలో ప్లేట్ లెట్స్ సంఖ్య అనేది కీలకంగా ఉంటుంది. ఒక మి.లీ రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య 20000 కి చేరినప్పుడు డెంగ్యూ తీవ్ర రూపం దాల్చినట్టు అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిరంతర వైద్యుల పర్యవేక్షణ ఎంతో అవసరం. ఈ దశలోనే శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య తీవ్రం అవకుండా ముందుగానే వైద్యులను సంప్రదించి మొదటి దశలోనే డెంగ్యూను నివారించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.