Urine: మన శరీరంలో తయారయ్యే వ్యర్థ జలాన్ని ఎప్పటికప్పుడు కిడ్నీలు బయటకు పంపిస్తుంటాయి. దాన్నే మూత్రం అంటారు. మూత్రం ముందుగా మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. అక్కడ అది నిండిపోతే మనకు మూత్రం పోయాలని మెదడు సూచన ఇస్తుంది. దీంతో మనం మూత్ర విసర్జన చేస్తాం. అయితే మూత్రం పోయకుండా ఎన్ని గంటల సేపు మూత్రాన్ని ఆపుకోవచ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు పోయకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం 2 కప్పుల మూత్రాన్ని ఉత్పత్తి చేసేందుకు సుమారుగా 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. మన మూత్రాశయం 2 కప్పుల మూత్రాన్ని నిల్వ చేసుకోగలదు. మనం కనీసం 3 గంటలకు ఒకసారి అయినా సరే మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. ఇవి ఆరోగ్యవంతమైన వ్యక్తులకు వర్తించే విషయాలు.
అయితే మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే మన మూత్రాశయం అదనంగా మరో 2 కప్పుల మూత్రాన్ని నిల్వ చేస్తుంది. దీంతో మూత్రాశయం సైజ్ పెరుగుతుంది. మూత్రం పూర్తిగా ఉత్పత్తికి 9 గంటలు పడుతుంది కనుక గరిష్టంగా మనం మూత్రాన్ని ఆపుకోకుండా 9 గంటల పాటు ఉండవచ్చు. కానీ మనకు వీలుకాని పరిస్థితిలో మాత్రమే అలా చేయాలి. వీలున్నప్పుడల్లా.. అంటే.. 3 గంటలకు ఒకసారి కచ్చితంగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతాయి. ఆరోగ్యంగా ఉంటాము.
ఇక మూత్రాన్ని తరచూ ఎక్కువ సేపు ఆపుకోవడం మంచిది కాదు. దీని వల్ల మూత్రాశయం, కిడ్నీలపై భారం పడుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కండరాలపై ఒత్తిడి పడుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు ఫెయిల్ కూడా కావచ్చు. ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరుగుతుంది. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల మూత్రాన్ని అసలు ఆపుకోరాదు. 3 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేస్తుండాలి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.