Yoga For Digestion: రోజూ రాత్రి పూట భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. జీర్ణశక్తి నశిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అందువల్ల రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు. కనీసం 3 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
ఇక అజీర్ణ సమస్య ఉన్నవారు, మలబద్దకంతో బాధపడుతున్నవారు భోజనం చేసిన తరువాత కింద తెలిపిన రెండు ఆసనాలను వేయవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ ఆసనాలు ఏమిటో, ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
వజ్రాసనం
ముందుగా సుఖాసన స్థితిని పొందాలి. నిటారుగా కూర్చోవాలి. రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి. కాళ్లను మోకాళ్ల దగ్గర వెనక్కి మడవాలి. వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి. పాదం కింది భాగం (అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి. మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి. పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి. వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి. అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి. రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి. వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
సుఖాసనం
నేలపై కూర్చుని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మడచి కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇలా సుఖంగా సౌకర్యంగా వెన్ను నిటారుగా ఉంచి ఎంతసేపైనా ఈ ఆసనంలో ఉండవచ్చు. అయితే భుజాలను సులభంగా వదిలేయకుండా దృఢంగా ఉంచాలి. సౌకర్యంగా ఉన్నంత సేపు ఈ భంగిమలో కూర్చోవచ్చు.
వజ్రాసనం, సుఖాసనం.. ఈ రెండు ఆసనాలను తిన్న తరువాతే కాదు, ఎప్పుడైనా వేయవచ్చు. ఎంత సేపైనా ఈ ఆసనాల్లో ఉండవచ్చు. సౌకర్యవంతంగా ఉన్నంత వరకు ఈ ఆసనం వేయవచ్చు. ఈ రెండు ఆసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఈ రెండు ఆసనాలను వేయడం వల్ల మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణాశయానికి రక్తసరఫరా పెరిగి అజీర్ణం తగ్గుతుంది.