Diabetic Foot : ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు డయాబెటిస్ జబ్బుతో బాధ పడుతున్నారని వివేదికలు చెబుతున్నాయి. వీరిలో చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు ఇంకా అన్ని జాతుల, దేశాల వారూ ఉన్నారు. అయితే అవగాహన లేకపోవడం వలన చాలా మంది డయాబెటిస్ బాధితులు తమ పాదాల సంరక్షణ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. షుగర్ సమస్య ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పాదాల సంరక్షణ కూడా ముఖ్యమైనది.
సాధారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నపుడు అది కిడ్నీలు, లివర్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కానీ అది మన పాదాలకు కూడా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవడానికి కారణం అవుతుందని మనలో చాలా మందికి తెలియదు. రక్తంలో ఉండే అధిక షుగర్ లెవల్స్ వలన నరాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే రక్త ప్రసరణలో ఇబ్బందులు, పాదాలపై పుండ్లు ఏర్పడటం, పాదాలు మొద్దుబారడం లాంటివి జరుగుతాయి. ఈ డయాబెటిస్ అనేది పాదాలకు జరిగే రక్త ప్రసరణను తగ్గించి నరాలను డ్యామేజ్ చేయడం వలన పాదాలు స్పర్శను కోల్పోతాయి. స్పర్శ లేకపోవడం వలన పాదాలకు చిన్న గాయం అయినప్పటికీ అది చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. దీనినే వైద్య భాషలో డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు.
కాళ్లలో నొప్పులు, మంట, కాళ్లు తిమ్మిరిగా అవడం, మొద్దు బారడం, చర్మం నల్ల బడటం, మొదలైనవి ఈ డయాబెటిక్ న్యూరోపతి యొక్క ముఖ్య లక్షణాలు. ఇంకా రక్త నాళాలు సన్నబడి, రక్త ప్రసరణకు అడ్డుపడటం, దాని వలన ప్రసరణ జరగాల్సిన రీతిలో జరగక ఇన్ఫెక్షన్లు బాధించడం, పాదాలపై గాయాలు ఎన్నటికీ మానకపోవడం లాంటివి జరుగుతాయి. రక్త నాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టడం వలన నరాలు ఉబ్బినట్టుగా తయారవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైనపుడు పాదాలను తొలగించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయట పడవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీని కోసం షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం. అలాగే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా మందులను వాడుతూ తరచూ షుగర్ పరీక్షలు చేయిస్తూ ఉండాలి. పాదాలు లేదా కాళ్లపై గాయాలు గానీ, ఇతర పుండ్లు ఏమైనా ఏర్పడుతున్నాయా అని తరచూ గమనిస్తూ ఉండాలి. స్నానం చేసినప్పుడు పాదాలపై తడి లేకుండా తుడిచి సరిగా ఆరనివ్వాలి. పాదలపై వాసన లేని క్రీములు లేదా జెల్లీ వంటివి రాయవచ్చు. పాదాల వేళ్ల మధ్యలో ఎటువంటి క్రీములు రాయకూడదు. పొగ తాగకూడం మానేయాలి. గోర్లు పెరగకుండా కత్తిరించుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా సంరక్షించుకోవడం వలన షుగర్ తో వచ్చే ఇబ్బందుల నుండి పాదాలను కాపాడుకోవచ్చు.