Blood Circulation : మన శరీరంలో రక్తం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలలోని పోషకాలను శరీరంలోని కణాలకు, అవయవాలకు సరఫరా చేస్తుంది. అలాగే శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయ పడుతుంది. అయితే శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా అయితేనే పనులన్నీ సక్రమంగా నిర్వర్తించబడతాయి. లేదంటే విధులకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చూసుకోవాలి. రక్త సరఫరా సరిగ్గా జరకగపోతే పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
మన శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. శరీరం మాటి మాటికీ చల్లబడుతుంటుంది. చలిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా జరగడం లేదని తెలుసుకోవాలి. అలాగే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కిడ్నీలపై ఆ ప్రభావం పడుతుంది. దీంతో పాదాలు, చేతుల్లో నీరు చేరుతుంది. దీన్ని ఎడిమా అని పిలుస్తారు. ఈ క్రమంలో పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఇది కూడా రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదనడానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక చిన్న చిన్న పనులకే బాగా అలసిపోతుంటే శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని గుర్తించాలి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తుంటాయి. దీంతోపాటు రక్త సరఫరా సరిగ్గా లేకపోతే పురుషుల్లో అంగ స్తంభనలు ఉండవు. శృంగారంపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు బాగా ఉన్నవారిలోనూ రక్త సరఫరా తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం సమస్య కూడా వస్తుంది. రక్త సరఫరా సరిగ్గా లేకపోతే మతిమరుపు వస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత ఉండదు.
రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే జీవక్రియల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. తరచూ రోగాల బారిన పడుతుంటారు. అవి అంత త్వరగా తగ్గవు. ఆకలి లేకపోయినా, చర్మం రంగులో మార్పులు కనిపిస్తున్నా.. రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. అలాగే రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే గోళ్లు, వెంట్రుకలు బలహీనంగా మారిపోతాయి. వాటి పెరుగుదల ఆగిపోతుంది.
దీంతోపాటు కాళ్లలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు వాపులకు గురై బయటకు కనిపించడం.. తదితర లక్షణాలు కనిపిస్తున్నా శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేదని తెలుసుకోవాలి. ఇలా గనక లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.