Ghee : మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. దీన్ని కొన్ని వంటకాల్లో వేస్తుంటారు. నెయ్యితో తీపి వంటకాలను ఎక్కువగా తయారు చేసి తింటుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేదంలో నెయ్యికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. నెయ్యిని కొందరు నేరుగా తింటే.. కొందరు భోజనంలో కలిపి తింటారు. ఈ క్రమంలోనే చాలా మంది నెయ్యిని హల్వా, పప్పు, చపాతీలు.. వంటి వాటితో కలిపి తింటుంటారు. నెయ్యి వల్ల ఆయా ఆహారాలకు చక్కని రుచి వస్తుంది.
ఆయుర్వేద ప్రకారం నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అనేక ఔషధాల తయారీలో నెయ్యిని ఉపయోగిస్తారు. అయితే నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుండెకు మంచిది కాదని, బరువు పెరుగుతారని.. అంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? ఆ కారణాలు చెప్పి నెయ్యిని వాడొద్దా ? అంటే..
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని వంటల్లో ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు నెయ్యిని బాగా తినేవారు. అందుకనే వారు ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవించారు. అందువల్ల నెయ్యిని తినాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక నెయ్యిలో విటమిన్లు ఇ, ఎ, సి, డి, కె లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కానీ నెయ్యిలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ కొందరికి మంచివి కావు.
న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం.. శాచురేటెడ్ ఫ్యాట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డంకులను సృష్టిస్తుంది. అలాగే శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) పేరుకుపోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం, షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచవని తేలింది. లాంగ్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతాయని వెల్లడైంది.
ఇక నెయ్యిలో ఎక్కువగా లాంగ్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లే ఉంటాయి. అందువల్ల అధ్యయనాలు చెప్పిన ప్రకారం నెయ్యి అనారోగ్యకరం అనిపిస్తుంది. కానీ రోజూ ఎలాంటి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయని వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. వారు నెయ్యి లాంటి పదార్థాలను తిన్నా తినకపోయినా.. కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తింటే అది అధిక ఇన్సులిన్ ఉత్పత్తికి కారణం అవుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ క్రమంలో ఇలాంటి వారు నెయ్యి తినా, తినకపోయినా వారికి ముప్పు ఎక్కువగానే ఉంటుంది.
అయితే రోజూ యాక్టివ్‌గా ఉండేవారు.. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ చేసేవారు.. నెయ్యిని భేషుగ్గా తినవచ్చు. దీంతో వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుపోవు. అలాగే నెయ్యి వారి మెటబాలిజంను క్రమబద్దీకరిస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. అధిక బరువు త్వరగా తగ్గుతారు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక ఇప్పుడు అర్థం అయింది కదా.. నెయ్యిని ఎవరు తినాలో. రోజూ శారీరక శ్రమ చేసేవారు, జిమ్, వ్యాయామం చేసేవారు.. నెయ్యిని నిరభ్యంతరంగా తినవచ్చు. అందులో సందేహించాల్సిన పనిలేదు. అధికంగా బరువు పెరుగుతామని, గుండె జబ్బులు వస్తాయని అపోహలకు గురి కావల్సిన పనిలేదు.
ఇక రోజూ ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా, వ్యాయామం లేకుండా కూర్చుని గంటల తరబడి పనిచేసేవారు నెయ్యిని తినరాదు. అది వారిలో మరిన్ని సమస్యలను కలగజేస్తుంది. కానీ చిన్నారులకు నెయ్యిని తినిపించవచ్చు. అది వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది.