Vitamin D : మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది మనకు సహజసిద్ధంగానే లభిస్తుంది. సూర్యకాంతిలో మన శరీరం ఉంటే దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. మన శరీరంలో అనేక రకాల ప్రక్రియలకు విటమిన్ డి అవసరం అవుతుంది. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మందికి సూర్య రశ్మి తగలడం లేదు. ఇది సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చలికాలంలో సూర్య రశ్మి తగలడం ఆలస్యమవుతుంది. దీంతో విటమిన్ డి ఈ సీజన్‌లో సరిగ్గా లభించదు. దీని వల్ల సమస్యలు వస్తుంటాయి.
ఉదయం నిద్రలేవగానే రోజూ 25 నుంచి 30 నిమిషాల పాటు శరీరం సూర్యరశ్మిలో ఉండాలి. అంటే.. అంత సమయం పాటు మనం ఎండలో గడపాలన్నమాట. ఉదయం 8 గంటలలోపే మన శరీరానికి ఎండ తగలాలి. ఉదయం ఎండలో 25 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఓ వైపు వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుంది. మరోవైపు సూర్య రశ్మి లభిస్తుంది. దీంతో శరీరం విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది.
ఇక ఉదయం సూర్య రశ్మిలో గడపని వారు సాయంత్రం అయినా సరే కొంత సేపు శరీరానికి ఎండ తగిలేలా ఉండాలి. విటమిన్ డి మనకు రోజూ కావల్సిన పోషక పదార్థం. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎక్కువ సేపు పనిచేసినా అలసిపోరు.
సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరంలో రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది షుగర్ ఉన్నవారికి మేలు చేస్తుంది.
సూర్యరశ్మిలో ఉండడం వల్ల మన శరీరం సెరొటోనిన్, మెలటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మనకు ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మూడ్ మారుతుంది. సంతోషంగా ఉంటారు.
విటమిన్ డి మనకు తగినంత లభిస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. అయితే సూర్య రశ్మిలో ఉంటే విటమిన్ డి లభించే మాట వాస్తవమే అయినా.. ఉదయం 8 గంటలు దాటాక ఎండలో ఉండరాదు. అలాగే సాయంత్రం 4, 5 గంటల తరువాత కొంత సేపు ఎండలో ఉండవచ్చు. సూర్య కిరణాల తీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే ఎండలో ఉండాలి. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మన శరీరం విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది.