Kidneys Health : మన శరరీంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి వెన్నెముక కింది వైపు ఉంటాయి. కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని వడబోస్తాయి. అందులో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో మన శరీరంలో ఉండే వ్యర్థాలు మూత్రం రూపంలో ఎప్పటికప్పుడు బయటకు వెళ్తుంటాయి. దీని వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కిడ్నీలు ఫెయిల్ అయితే ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
కిడ్నీల చెడిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. పలు దీర్ఘకాలిక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కాలుష్యానికి గురి కావడం వల్ల, కొన్ని రకాల మెడిసిన్లను వాడడం వల్ల, డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉండడం వల్ల, కిడ్నీలకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల, పలు ఇతర కారణాల వల్ల కూడా కిడ్నీలు చెడిపోతుంటాయి. అయితే కిడ్నీలు ఫెయిల్ అవుతున్న క్రమంలో మన శరీరం కొన్ని లక్షణాలను, సంకేతాలను చూపిస్తుంటుంది. అవేమిటంటే..
1. కిడ్నీలు ఫెయిల్ అయినవారికి మూత్రం తక్కువగా వస్తుంటుంది. సడెన్‌గా మూత్రం పరిమాణం తక్కువగా వస్తుందంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. కిడ్నీలు చెడిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. దీంతో వెంటనే డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకుంటే కిడ్నీలు ఇంకా చెడిపోకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతోపాటు ప్రాణాపాయం ముప్పు కూడా తప్పుతుంది.
2. కాళ్లు, మడమలు, పాదాల్లో నీరు చేరి వాపులకు గురవుతుంటాయి. ఎప్పుడైనా ఎక్కువ సేపు కూర్చుంటే ఇలా జరగడం సహజమే. కానీ ఇలా తరచూ జరుగుతుందంటే కిడ్నీలు చెడిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది.
3. కిడ్నీలు ఫెయిల్ అయినవారిలో శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు వస్తుంటాయి. శ్వాస సరిగ్గా ఆడదు. ఇలాంటి లక్షణం కనిపిస్తున్నా దాన్ని కిడ్నీ ఫెయిల్‌గా అనుమానించాలి.
4. కిడ్నీలు చెడిపోయిన వారికి తీవ్రమైన మత్తుగా, మగతగా అనిపిస్తుంది. తీవ్రమైన అలసట ఉంటుంది.
5. కిడ్నీలు ఫెయిల్ అయితే వికారం సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరిలో వాంతులు కూడా అవుతుంటాయి.
6. కిడ్నీలు ఫెయిల్ అయినవారిలో ఒత్తిడి, ఆందోళన, కంగారు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే ఆందోళన చెందుతుంటారు.
7. కిడ్నీలు ఫెయిల్ అయితే ఛాతిలోనూ నొప్పిగా అనిపిస్తుంటుంది. కొందరికి ఫిట్స్ రావచ్చు. మరీ బాగా కిడ్నీలు చెడిపోతే కొందరు కోమాలోకి వెళ్తారు.
8. కిడ్నీలు ఫెయిల్ అయినవారిలో మూత్రం రంగులోనూ మార్పులు కనిపిస్తాయి. మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో వస్తున్నా, మూత్రంలో నురుగు వస్తున్నా.. కిడ్నీలు చెడిపోయాయని అర్థం చేసుకోవాలి.
ఈ క్రమంలో పై లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే ముందుగానే గుర్తించిన వారమవుతాం. దీంతో ప్రాణాపాయం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.