Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. అనంతరం దాన్ని శరీరానికి అందిస్తాయి. తరువాత అవయవాల నుంచి బయటకు వచ్చే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి బయటకు వదిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్తవుతుంది. మన శరీరానికి గాలి సరిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు అవి సరిగ్గా పనిచేయలేవు. ఈ క్రమంలోనే మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఊపిరితిత్తులకు అనేక కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు దగ్గు అధికంగా వస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే కఫం అంతా బయటకు పోతుంది. కనుక దగ్గు బాగా వస్తుందంటే.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చిందేమోనని అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
2. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చినవారికి ఛాతిలో నొప్పి వస్తుంటుంది. ఏదైనా వస్తువుతో పొడిచినట్లు నొప్పి వస్తుంది. ఇది ఒక ఊపిరితిత్తి లేదా రెండు ఊపిరితిత్తుల్లో వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
3. అధికంగా జ్వరం ఉన్నవారికి లంగ్ ఇన్‌ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తులకు ఏ కారణం వల్ల అయినా సరే ఇన్‌ఫెక్షన్ వస్తే కొందరికి జ్వరం బాగా ఉంటుంది.
4. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చినవారికి ఒళ్లు నొప్పులు బాగా ఉంటాయి. అలాగే తలనొప్పి వస్తుంది. ముక్కు నుంచి నీరు కారుతుంది.
5. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారిలో కొందరికి శ్వాస సరిగ్గా ఆడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
6. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా.. ఇన్‌ఫెక్షన్ వచ్చినా.. తీవ్రంగా అలసట ఉంటుంది. చిన్న పనికే బాగా అలసిపోతారు. అలాగే గురక బాగా వస్తుంటుంది.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా తేడా ఉన్నట్లు గమనిస్తే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.