Ghee : మన దేశంలో చాలా మంది తినే ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలు నెయ్యిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంత మంది ఆవు నెయ్యి ని ఇష్ట పడితే మరికొంత మంది గేదె నెయ్యి ని ఇష్టంగా వాడుతుంటారు. ఇంకా వెన్న రూపంలో కూడా చాలా వంటల్లో వాడటం మనం చూస్తునే ఉన్నాం. వివిధ రకాల ఆహార పదార్థాలకు నెయ్యి ద్వారా ప్రత్యేకమైన రుచి వస్తుంది. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పట్ల, మనం తీసుకునే ఆహారం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్న ఈ తరుణంలో కొంత మందికి దీనిని వాడడం ఆరోగ్యకరమైనదేనా అనే సందేహం వస్తూ ఉంటుంది. నెయ్యి వలన కలిగే నిజమైన లాభాలు, దుష్ప్రభావాల విషయంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
నెయ్యి వలన కలిగే దుష్ప్రభావాల్లో ముందుగా చెప్పుకోదగినది కొలెస్ట్రాల్ సమస్య. ఇంకా ఒబెసిటీ, పీసీఓడీ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి జోలికి వెళ్లకూడదు. ఒక టీస్పూన్ నెయ్యిలో 7.9 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. అలాగే 112 క్యాలరీస్ ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసిన ప్రకారం ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి రోజుకు 2000 క్యాలరీలు అవసరం. అలాగే రోజులో తీసుకునే కొవ్వు 56 నుండి 78 గ్రాములకు మించకూడదు. దీనిలో సంతృప్త కొవ్వులు 16 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదని సూచిస్తున్నారు.
అయితే మన శరీరం మనం తీసుకునే ఆహారం నుండి దానంతట అదే కావలసిన కొవ్వుని తయారుచేసుకుంటుందని దానికి మనం తీసుకునే నెయ్యి కూడా కలిసినపుడు కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. వివిధ రకాల వ్యాధులతో ఉన్నవారు నెయ్యిని వాడకూడదని సలహా ఇస్తున్నారు.
అంతే కాకుండా గుండె జబ్బులు, కిడ్నీ సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా నెయ్యి, వెన్న మొదలైన వాటికి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు బ్లడ్ ప్రెజర్ ని పెంచుతాయని సూచిస్తున్నారు. జీర్ణాశయంలో ఇబ్బందులు ఉన్నవారు నెయ్యి తినకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు దాటిన వారు డాక్టర్ల సలహా మేరకు ఎంత నెయ్యి అవసరమో తెలుసుకొని అంత మోతాదులోనే తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని తెలుపుతున్నారు.