Urine Color And Diseases : మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మూత్రం, చెమట, మలం ద్వారా బయటకు వెళ్తుంటాయి. అయితే మూత్రం చాలా మందికి క్లియర్‌గానే ఉంటుంది. కానీ కొందరికి రంగు మారి వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వ్యక్తులకు ఉండే ఆరోగ్య సమస్యలు, వారు వాడే మందులు, తింటున్న ఆహారం.. వంటి పలు కారణాల వల్ల వారికి వచ్చే మూత్రం కలర్ మారుతుంది. అయితే కొన్ని రకాల కలర్‌లతో మూత్రం తరచూ వస్తుంటే మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే.. అలా మూత్రం ఓ నిర్దిష్టమైన రంగులో వస్తే మీకు త్వరలోనే ఏదో ఒక డేంజర్ వ్యాధి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే మూత్రం క్లియర్‌గా వచ్చేట్లు చూసుకోవాలి. అయితే మూత్రం రంగును బట్టి ఎలాంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రం క్లియర్‌గా లేత పసుపు రంగులో వస్తుంటే మీరు సరిగ్గానే నీళ్లను తాగుతున్నారని.. మీకు ఎలాంటి వ్యాధులు లేవని అర్థం చేసుకోవాలి. అలాగే మూత్రం డార్క్ పసుపు రంగు లేదా గోధుమ రంగులో వస్తుంటే అది డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది. అంటే మీరు తాగుతున్న నీరు శరీరానికి సరిపోవడం లేదని అర్థం. మీరు మరిన్ని నీళ్లను తాగాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. నారింజ రంగులో మూత్రం వస్తుంటే అందుకు మీరు వాడుతున్న పలు మెడిసిన్లు కారణం కావచ్చు. లేదా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల, డీహైడ్రేషన్ బారిన పడడం వల్ల కూడా ఇలా నారింజ రంగులో మూత్రం వస్తుంది. అయితే లివర్ లేదా పిత్తాశయ సమస్యలు ఉన్నా కొందరికి ఇలా మూత్రం నారింజ రంగులో వస్తుంది. కనుక వీరు జాగ్రత్త పడాల్సిందే.
ఇక కొందరికి మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో వస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ఈ కలర్‌లో మూత్రం వస్తుంది. ఈ రంగులో మూత్రం వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలసి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక లివర్ వ్యాధులు ఉన్నవారికి, తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడిన వారికి లేదా కండరాల కణజాలం నష్టానికి గురయ్యే రాబ్డోమయోలిసిస్ అనే వ్యాధి ఉన్నవారికి మూత్రం బ్రౌన్ కలర్‌లో వస్తుంది. ఈ కలర్‌లో మూత్రం వచ్చినా సరే జాగ్రత్త పడాల్సిందే.
కొందరికి గ్రీన్ లేదా బ్లూ కలర్‌లోనూ మూత్రం వస్తుంది. ఇందుకు వారు తీసుకునే మెడిసిన్లు లేదా ఆహారం ఇతర జన్యు సంబంధమైన కారణాలు అయి ఉండవచ్చు. కొందరికి మూత్రం పాలలాగా నురుగుతో లేదా మడ్డిగా వస్తుంది. సాధారణంగా చీము, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ఇలా మూత్రం వస్తుంది. కనుక ఇలా మూత్రం వచ్చినా సరే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాల మీదకు రాకుండా చూసుకోవచ్చు.
అయితే రోజూ తగినన్ని నీళ్లను తాగడం, తాజా పండ్లు, కూరగాయల రసాలను సేవించడం, నిమ్మరసం, తేనె ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుంటే పైన తెలిపిన చాలా వరకు సమస్యలు పోతాయి. అయినప్పటికీ ఫలితం లేకపోతే ఎట్టి పరిస్థితిలోనూ డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సిందే. లేదంటే ప్రాణాంతకం అవుతుంది.