Urine Color : మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మన శరీరం ఆ సమస్యను సూచించే విధంగా పలు లక్షణాలను మనకు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అందరికీ తెలుసు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా, రాబోతున్నా అందుకు మన శరీరం పలు సంకేతాలను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మనకు కలిగే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. అయితే మనకు కలిగే అనారోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మన మూత్రం రంగు ఉపయోగపడుతుంది. మన మూత్రం ఉన్న రంగు, దాన్నుంచి వచ్చే వాసనను బట్టి మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చు. దీంతో సకాలంలో స్పందించి డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు వీలు కలుగుతుంది. మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే మన మూత్రం రంగు, వాసన ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా.
యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్, కిమోథెరపీ డ్రగ్స్, లాక్సేటివ్ డ్రగ్స్‌ను వాడితే మూత్రం రంగు ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. దీంతోపాటు విటమిన్ బి2, బీటా కెరోటీన్ ఎక్కువగా ఉండే క్యారెట్ వంటి ఆహారాలను తిన్నా మూత్రం రంగు ఇలా మారుతుంది. అయితే ఇవేవీ కారణాలు కాకపోతే మీరు నీటిని సరిగ్గా తాగడం లేదని అర్థం. నీటిని తగినంత తాగకపోయినా మూత్రం రంగు ఆరెంజ్‌లోకి మారుతుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాలి. ఇక ఇవే కాకుండా లివర్, కంటి సమస్యలు ఉన్నా అలా మూత్రం ఆరెంజ్ రంగులో వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
ఎరుపు లేదా పింక్ రంగులో ఉండే ఆహారాలను తింటే మూత్రం కూడా ఇదే రంగులో వస్తుంది. దీనికి చింతించాల్సిన పనిలేదు. ఇలా కాకుండా వేరే కారణాల వల్ల అయితే జాగ్రత్త పడాల్సిందే. కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, కిడ్నీ స్టోన్లు, క్యాన్సర్, ట్యూమర్లు, బ్లడ్ క్లాట్స్, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవారిలో మూత్రం ఈ రంగులో వస్తుంటుంది. ఇక మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్లు ఉంటే మూత్రం ఒక్కోసారి గ్రీన్ లేదా బ్లూ కలర్‌లోనూ వస్తుంటుంది. అలాగే డీహైడ్రేషన్, కడుపు నొప్పి, ర్యాషెస్, మూర్ఛ, ట్యూమర్లు వంటి సమస్యలు ఉంటే మూత్రం బ్రౌన్ రంగులో వస్తుంది.
మూత్రంలో నురగ వస్తుందంటే అది కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధి అయి ఉండవచ్చు. కనుక ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మూత్రం రంగు మరీ పారదర్శకంగా ఉంటే మీరు నీరు అవసరానికి మించి తాగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా జరిగితే ఒంట్లో ఉన్న అవసరమైన మినరల్స్, సాల్ట్స్ కోల్పోవాల్సి వస్తుంది. కనుక మన శరీరానికి అవసరం ఉన్నంత మేర మాత్రమే నీటిని తాగాలి. ఇక లేత లేదా ముదురు పసుపు రంగుల్లో మూత్రం వస్తుంటే చింతించాల్సిన పనిలేదు. కాకపోతే ముదురు పసుపు రంగులో మూత్రం వస్తేనే నీరు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఈ రంగు డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది. మీరు ఎక్కువగా నీళ్లను తాగడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ రంగులో మూత్రం వస్తే నీళ్లను ఎక్కువగా తాగాలి. దీంతో మూత్రం మళ్లీ మామూలు రంగులోకి మారుతుంది. ఇలా మూత్రం రంగును బట్టి మనకు ఉన్న అనారోగ్య సమస్యలను అర్థం చేసుకోవచ్చు.