ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల్లో వచ్చే అసమతుల్యతల వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో దోషం హెచ్చు తగ్గులను బట్టి వ్యాధులు వస్తుంటాయి. ఇక అగ్ని, జలం కలయికే పిత్తం. ఇది వేడి, నూనె, కాంతి అనే స్వభావాలను కలిగి ఉంటుంది. శరీరంలో పిత్తం ఎక్కువైతే పిత్త దోషం వస్తుంది.
పిత్త దోషం శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, చెమట పట్టేందుకు, నిద్రకు, ఆలోచించేందుకు, తెలివి తేటలకు, జ్ఞాపకశక్తికి, అనర్గళంగా మాట్లాడేందుకు కారణమవుతుంది. ఈ దోషం అసమతుల్యత వల్ల కోపం, ఆందోళన, చర్మ సమస్యలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే అతి దాహం, ఆకలి, గ్యాస్, అజీర్ణం, వికారం, విరేచనాలు, మలబద్దకం, ఇతర జీర్ణాశయ సమస్యలు, జుట్టు బాగా రాలడం, మహిళల్లో హార్మోన్ల సమస్యలు, రుతు సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, తలతిరగడం, తలనొప్పి, శరీర దుర్వాసన, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.
రోజూ యోగా చేయడం వల్ల పిత్త దోషాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. సోయా సాస్, ఉప్పు, వెన్న, పుల్లని పదార్థాలు, వైన్, చాకొలెట్, మసాలాలు వంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. లేదా మానేయాలి.
తీపి, చేదు ఉండే కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే పిత్త దోషం తగ్గుతుంది. క్యాబేజీలు, కీరదోస, కాలిఫ్లవర్, పచ్చి బఠానీలు, బీన్స్, చిలగడ దుంపలు, ఆకుపచ్చని కూరగాయల, ఆకు కూరలు, గుమ్మడి కాయ విత్తనాలు, బ్రొకొలి వంటి వాటిని తీసుకోవాలి. అలాగే బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది.
యాపిల్స్, కొబ్బరి, పుచ్చకాయలు, నారింజ, నేరేడు, దానిమ్మ, మామిడి పండ్లు వంటి పండ్లను తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మానేయాలి. చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనె వాడాలి. ప్యాకెట్ పాలు, పెరుగు కాకుండా సహజసిద్ధమైన పాలు, పెరుగు వాడాలి. నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది వాడాలి. దాల్చిన చెక్క, పసుపు, యాలకులు, సోంపు గింజలను తీసుకోవాలి. మిరియాలను వాడవచ్చు. ఉప్పు, కారం తగ్గించాలి. కోడిగుడ్లను తినవచ్చు. కానీ చికెన్, మటన్, సీఫుడ్‌ను తగ్గించాలి. లేదా మానేయాలి. ఈ సూచనలు పాటించడం వల్ల శరీరంలో పిత్త దోషం తగ్గుతుంది. ఆ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365