మన శరీరం సహజంగా నిర్వహించే ప్రక్రియల్లో ఆవులింత కూడా ఒకటి. కొందరికి ఇవి ఎక్కువగా వస్తే, ఇంకా కొందరికి ఆవులింతలు తక్కువగా వస్తాయి. ఇక కొందరికైతే నిద్ర పోకున్నా, బాగా అలసిపోయినా ఆవులింతలు వస్తాయి. అయితే నిజానికి ఆవులింతలు కేవలం ఈ రెండు కారణాల వల్లే వస్తాయా..? లేదంటే అవి రావడానికి ఇంకా కారణాలు ఏమైనా ఉంటాయా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువైనప్పుడు సహజంగానే ఆవులింతలు ఎక్కువగా వస్తాయట. దీంతో పెద్ద మొత్తంలో గాలి లోపలికి వెళ్తుంది. తద్వారా శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దీంతో ఆవులింతలు రావడం తగ్గుతుంది.
ఊపిరితిత్తుల్లో గాలి గదులు ఉంటాయి కదా. మనం పీల్చే గాలి వాటిల్లోకి చేరుతుంది. అయితే ఆ గాలి గదులు ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు మనకు ప్రమాదం కలుగుతుందట. ఈ క్రమంలోనే దాన్ని నివారించడం కోసం ఒక్క సారిగా ఆవులింత వస్తుంది. దీంతో గాలి ఆ గదుల్లో నిండుతుంది. తద్వారా ప్రమాదం నుంచి బయట పడవచ్చు. ఎక్కువగా బోర్ కొట్టినప్పుడు, ఏ పనీ చేయబుద్ది కానప్పుడు కూడా ఆవులింతలు వస్తాయట. అలాంటి సమయంలో ఆవులింతలు వచ్చాయంటే రెస్ట్ తీసుకోవాలని శరీరం సూచిస్తుందట. అందుకు సంకేతంగానే ఆవులింతలు వస్తాయట.
సరైనన్ని గంటల పాటు నిద్రించినా ఉదయాన లేవగానే చాలా మందికి ఆవులింతలు వస్తాయి. అది ఎందుకంటే మనల్ని అలర్ట్ చేసేందుకు శరీరం పంపే సంకేతమే అది. ఆ సమయంలో సాధారణంగా ఎవరైనా లేజీగా ఉంటారు. కనుక ఆ మబ్బు పోయి యాక్టివ్‌గా ఉండడం కోసమే శరీరం ఆవులింతలను తీస్తుందట. గుండె సమస్యలు, మెదడు సమస్యలు ఉన్న వారిలో కూడా ఆవులింతలు ఎక్కువగా వస్తాయట. అలా అని సైంటిస్టులే చెబుతున్నారు. ఆవులింత అనేది అంటు రోగం లాంటిదట. ఆవులింత తీసేవారి ఎదురుగా ఉంటే ఎవరికైనా ఆవులింత ఆటోమేటిక్‌గా వస్తుందట. ఇక ఆవులింతల గురించి చదివినా ఆవులింత వస్తుందట. దాన్ని గురించి మాట్లాడినా ఆవులింత వస్తుందట. ఇది సహజంగా జరిగే ఓ ప్రక్రియ అని సైంటిస్టులు చెబుతున్నారు.
గర్భాశయంలో పెరిగే నవజాత శిశువులు, ఆ మాట కొస్తే ఇంకా తక్కువ దశలోనే ఉండే పిండాలు కూడా ఆవులిస్తాయట. మెదడు ఎదుగుతున్న కొద్దీ ఆ ఆవులింతలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. పని ఒత్తిడి బాగా ఉన్న వారికి కూడా ఆవులింతలు ఎక్కువగా వస్తాయట. ఎందుకంటే అలాంటి సమయాల్లో మెదడుపై భారం పెరిగి అందులో ఉష్ణోగ్రత పెరుగుతుందట. దీంతో మెదడును కూల్ చేసేందుకు ఆవులింతలు వస్తాయట.