రామాయణంలో ఓ పాత్ర అయిన కుంభకర్ణుడి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడని, మేల్కొంటే అతని ఆకలిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని కూడా తెలుసు. అయితే నిజానికి కుంభకర్ణుడికి అలా నిద్రపోయే, అతిగా తినే అలవాటు ముందు నుంచీ లేదు. అతను యుక్త వయస్సు వచ్చేటప్పటికీ అందరిలాగే ఉండేవాడట. కానీ శాపవశాత్తూ అలా అయిపోయాడట. ఇంతకీ అసలు కుంభకర్ణుడు అలా నిద్రపోవడానికి కారణం ఎవరో తెలుసా..? అదే తెలుసుకుందా రండి..!
రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు అన్నదమ్ములు. వారు అన్ని విద్యలు నేర్చుకున్నాక తండ్రి విశ్రవసుడు వారికి చెబుతాడు. తపస్సు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తులను సంపాదించవచ్చని అంటాడు. దీంతో ముగ్గురూ అడవులకు వెళ్లి తీవ్రంగా తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకోమని అంటాడు. అప్పుడు రావణుడు తనకు మృత్యువు రావద్దని అడుగుతాడు. అయితే బ్రహ్మ ఆ విరం ఇవ్వడు. కానీ పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవుళ్లు ఎవరూ చంపలేరని రావణుడికి బ్రహ్మం వరం ఇస్తాడు. ఆ తరువాత విభీషణుడి వంతు వస్తుంది. అప్పుడు విభీషణుడు తనను అన్ని వేళలా సన్మార్గంలో నడిచేలా చేయాలని బ్రహ్మను కోరుతాడు. దీనికి బ్రహ్మ సంతోషించి అతనికి మరణం లేకుండా చేస్తాడు.
ఇక చివరిగా కుంభ కర్ణుడి వంతు వస్తుంది. అయితే అప్పటికే అతను చాలా శక్తివంతుడై ఉండడం చేత, అతని కోరిక ఏంటో తెలిసి ఉండడం చేత బ్రహ్మ ఓ ఉపాయం పన్నుతాడు. కుంభకర్ణుడు ఇంద్రుడి సింహాసనం అడుగుతామని, అతను అదే ఆలోచనలో ఉన్నాడని బ్రహ్మ కనిపెడతాడు. దీంతో అతని నోటి వెంట ఇంద్రుడు అనే మాటకు బదులుగా నిద్ర అనేలా పదం రావాలని బ్రహ్మ సరస్వతిని ఆదేశిస్తాడు. దీంతో కుంభకర్ణుడు ఇంద్రుడి సింహాసం అడుగుతామని మాట్లాడుతుండగా అతని నోటి వెంట నిద్ర కావాలని వస్తుంది. దీంతో అతనికి శాశ్వతంగా, ఎప్పటికీ నిద్రపోయే వరం ప్రసాదిస్తాడు బ్రహ్మ. అయితే దీన్ని గమనించిన రావణుడు కోపోద్రిక్తుడవుతాడు. ఆ తరువాత తమాయించుకుని బ్రహ్మను వచ్చి అడుగుతాడు.
తన తమ్ముడు అలా ఎప్పటికీ నిద్రలో ఉండకుండా అనుగ్రహించాలని రావణుడు బ్రహ్మను కోరుతాడు. దీంతో బ్రహ్మ కొంచెం దిగివచ్చి కుంభకర్ణుడికి ఇచ్చిన వరాన్ని కొద్దిగా మారుస్తాడు. దాని ప్రకారం కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ సమయం పూర్తయ్యాక ఒక రోజు మేల్కొని ఉంటాడు. ఆ రోజంతా మనుషులు, చెట్లు, పక్షులు, జంతువులు అని తేడా లేకుండా అన్నింటినీ అతను తింటాడు. మళ్లీ ఆ ఒక్క రోజు కాగానే 6 నెలల పాటు నిద్రపోతాడు. అయితే రాముడితో యుద్ధం జరిగినప్పుడు రావణుడు తన తమ్ముడు కుంభ కర్ణున్ని లేపడం చాలా కష్టతరమవుతుంది. అప్పటికి అతను నిద్రపోయి కేవలం 9 రోజులే అవుతుంది. మళ్లీ 6 నెలల దాక లేవడని తెలిసినా రావణుడు బలవంతంగా కుంభ కర్ణున్ని లేపిస్తాడు. దీంతో కుంభకర్ణుడు లేచి ఆ యుద్ధంలో రాముడి చేతిలో మరణిస్తాడు. ఇదీ… కుంభకర్ణుని అసలు కథ..!