Mandodari : రావణుడి గురించి అంతో ఇంతో చాలా మందికి తెలియదు. కానీ అతని భార్య మండోదరి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతే కాకుండా మండోదరికి శివపార్వతులకు కూడా సంబంధం ఉందన్న విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అదేంటంటే.. తాను లేని సమయాన తన భర్త శివుడిని పెళ్లి చేసుకోడానికి ప్రయత్నించిందని.. తెలిసి మధుర ను కప్పగా మారాలని శపిస్తుంది పార్వతి. భర్త శివుడి కోరికపై శాపాన్ని 12 ఏళ్లకు తగ్గిస్తుంది.
మరోవైపు రాక్షస రాజైన మాయాసుర తన భార్య హేమతో కలిసి కూతురి కోసం తపస్సు చేస్తుంటారు. అదే సమయంలో కప్పగా 12 ఏళ్ళు పూర్తిచేసుకొని ఓ నూతిలో ఏడుస్తున్న మధురను చూసిన ఆ దంపతులు ఆమెకు మండోదరి అని పేరు పెట్టుకొని పెంచుకుంటుంటారు. మండోదరి అంటే సన్నని నడుము కలిగిన స్త్రీ లేదా సంతాన సాఫల్యత గల ఉదరము అని అర్థం.
ఓ సారి రావణుడు మాయాసురుడి ఇంటికొచ్చినప్పుడు మండోదరిని చూసి పెళ్లి చేసుకుంటానని పట్టుబడతాడు. దీనికి మాయాసురుడు అడ్డు చెప్పడంతో అతనితో యుద్దానికి సిద్దమవుతాడు. రావణుడి బలం తెలిసిన మండోదరి అతని చేతిలో తండ్రిని కోల్పోవడం ఇష్టంలేక ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉంటుంది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించి ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. భర్త తన బిడ్డని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత.
రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది. యుద్దం తర్వాత రాముడు విష్ణువు అవతారమని తెలిసి అతనిని శరణు కోరుతుంది. రావణుడి తమ్ముడైన విభీషణుడిని పెళ్లాడమని సూచిస్తాడు. రాజ్యం శాంతి కోసం మండోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుంటుంది.