రామసేతు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇది నీటిపై తేలే రాళ్లతో నిర్మించిన ఒక వంతెన. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావడానికి.. శ్రీరాముడు తన వానరసేనతో కట్టించిన బ్రిడ్జి లాంటి కట్టడం. మరి ఆ రామసేతువు ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? తెలుసుకోండి మరి. రామాయణం గురించి తెలిసిన వాళ్లందరికీ రామసేతువు గురించి తెలిసే ఉంటుంది. రావణుడు సీతా మాతను అపహరించి లంకలో ఉంచినప్పుడు, సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు వానరుల సహాయంతో సేతువును నిర్మించాడు. తద్వారా లంకకు వెళ్ళాడు. ఈ సేతువును తేలియాడే రాళ్లతో తయారు చేశారు. అయితే ఆ తేలియాడే సేతువు ఇప్పుడు ఎందుకు మునిగిపోయిందో మీకు తెలుసా?
శ్రీరాముడు, వానర సైన్యం కలిసి లంకను చేరుకోవడానికి, సీతమ్మతల్లిని రావణుడి చెరనుంచి విడిపించడానికి రామ సేతువును నిర్మించారని అందరికీ తెలుసు. కానీ రామ సేతువును తర్వాత ఎవరు మునిగేలా చేశారు? ఎందుకో చేశారో ఇప్పుడు చూద్దాం. రామాయణం ప్రకారం, రావణుడిని ఓడించిన తర్వాత, రాముడు సీతా, లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వస్తాడు. అయోధ్య రాజు అయిన తర్వాత, విభీషణుడు తన గొప్ప భక్తులలో ఒకడని రాముడు భావిస్తాడు. రావణుడి మరణం తర్వాత, విభీషణుడు లంకను పాలిస్తాడు. కాబట్టి శ్రీ రాముడు తన భక్తుడైన విభీషణుడును కలవడానికి లంకకు వెళ్లాలని అనుకుంటాడు. శ్రీ రామునితో పాటు భరతుడు కూడా పుష్పక విమానంలో లంకకు బయలుదేరుతారు.
శ్రీ రాముడు తనను కలవడానికి వస్తున్నాడని తెలుసుకున్న విభీషణుడు వారిని స్వాగతించడానికి నగరాన్ని అలంకరిస్తాడు. అన్ని ఏర్పాట్లతో శ్రీరామునికి ఘన స్వాగతం పలుకుతాడు. ఇప్పటివరకు రావణుడి పాలన ఉంది. ఇకనుంచి ఈ నగరాన్ని న్యాయంగా పాలించాలని శ్రీరాముడు.. విభీషణుడికి చెబుతాడు. దానికి విభీషణుడు అంగీకరిస్తాడు. కానీ విభీషణుడికి ఒక భయం ఉంటుంది. దాన్ని అతను శ్రీరామునితో చెబుతాడు. శ్రీరామ మీరు ఇక్కడికి రావడానికి నిర్మించిన సేతువు వల్ల మీకు ఉపకారమే జరిగింది. కానీ ఇకముందు అదే సేతువు దాటి, వేరే రాజులు వచ్చి రాజ్యం మీద యుద్ధం చేస్తే, ప్రజలకు హింస చేస్తే ఏమి చేయాలి? అని రామున్ని అడుగుతాడు. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం విభీషణుడు అలా శ్రీరామున్ని అడగగానే.. రాముడు తన బాణాలతో రామ సేతువును మునుగేలా చేస్తాడట. అందుకే తేలుతున్న రామ సేతువు ఇప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుందట.