Milk Business : సరైన ఆలోచన చేయాలే కానీ.. అందుకు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో ఉన్నవారు అయినా సరే అద్భుతాలు సాధించవచ్చు. సరిగ్గా ఆ యువతి కూడా అలాగే చేసింది. తాను పాఠశాలలో చదువుకునే రోజుల దగ్గర నుంచే ఇంటి బాధ్యతలను తీసుకుంది. పాల వ్యాపారం మొదలు పెట్టింది. క్రమ క్రమంగా ఆ వ్యాపారాన్ని ఆమె వృద్దిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె పాలను విక్రయిస్తూ నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. ఆమే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల శ్రద్ధా ధావన్.

శ్రద్ధా ధావన్ కు 2011లో 12 ఏళ్లు. అప్పట్లో వారి ఇంట్లో కేవలం ఒక గేదె మాత్రమే ఉండేది. కానీ ఆమె ఇంటి బాధ్యతలను తీసుకున్న తరువాత అదే గేదెకు ఆమె పనిచేసేది. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు తెల్లవారుజామునే ఇంటింటికీ తిరిగి పాలను పోసేది. అలా ఆమె పాలను విక్రయిస్తూ కష్టపడి డబ్బును కూడబెట్టి నెమ్మదిగా గేదెలను కొనసాగింది. దీంతో ఆమె వద్ద ఉండే గేదెల సంఖ్య పెరిగింది. అలా అప్పటి నుంచి దిన దిన ప్రవర్థమానం అన్నట్లు శ్రద్ధా ధావన్ వద్ద ఉండే గేదెల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.
ప్రస్తుతం వారి వద్ద 80 గేదెలు ఉండగా.. అవి రోజుకు సుమారుగా 450 లీటర్ల పాలను ఇస్తున్నాయి. వాటితో ఆమె నెలకు ఏకంగా రూ.6 లక్షలు సంపాదిస్తోంది. ఇదంతా శ్రద్ధా ధావన్ కృషి, పట్టుదలే అని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను ఆమె తీసుకుని.. పాల వ్యాపారంలో సక్సెస్ అయింది. దీంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
ఆమె తన వద్ద ఉన్న గేదెల కోసం ప్రత్యేకంగా ఓ 2 అంతస్తుల భవంతినే ఏర్పాటు చేసింది. ఆమె వద్ద కొందరు ఇప్పుడు పనిచేస్తున్నారు. దీంతో వారికి కూడా ఉపాధి లభిస్తోంది. అయితే ఎంత చిన్న వయస్సులో ఉన్నా సరే.. ఆలోచన అంటూ ఉండాలే గానీ.. దానికి కష్టం తోడైతే ఎవరైనా ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చని ఆమె చెబుతోంది. ఆమె అక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.