Aloo Bites : బంగాళాదుంపలతో మనం రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే స్నాక్స్ రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్ వెరైటీలలో ఆలూ బైట్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో పార్టీ జరిగినప్పుడు వీటిని తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆలూ బైట్స్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో రుచిగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆలూ బైట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత,కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఒరగానో – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ బైట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని వేడి నీటిలో వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ బంగాళాదుంపలను ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంపలను తురుముకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉంటే మరి కొద్దిగా బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుని బైట్స్ లాగా వత్తుకోవాలి. లేదంటే గుండ్రంగా కానీ మనకు నచ్చిన ఆకారంలో కానీ వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత 10 నిమిషాల పాటు డిఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న బైట్స్ ను ఇలాగే గాలి తగలని డబ్బాలో లేదా జిప్ లాక్ కవర్ లో ఉంచి డీఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటాయి. మనకు నచ్చినప్పుడు వీటిని ప్రై చేసుకుని తీసుకోవచ్చు. 10 నిమిషాల తరువాత వీటిని బయటకు తీసి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బైట్స్ వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బైట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.