Pineapple Health Benefits : మనం ఆహారంగా తీసుకునే రుచికరమైన పండ్లల్లో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ముక్కలుగా కట్ చేసుకుని అలాగే జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. చాలా మంది పైనాపిల్ ను తినడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. అలాగే ఈ పండు మనకు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటుంది. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్ లో ఉండే పోషకాలు అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ లో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఎంజైమ్ లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మనం వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే పైనాపిల్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటుతో బాధపడే వారు పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా పైనాపిల్ ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కనుక దీనిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పైనాపిల్ మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీని యొక్క గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు వైద్యుల సూచనల మేరకు దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా పైనాపిల్ కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.