Aloo Kurma : బంగాళాదుంపలతో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను వండుతూ ఉంటాము. తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా బంగాళాదుంపలతో రుచికరమైన ఆలూ కుర్మా ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూరను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దేనితో తినడానికైనా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఆలూ కుర్మా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4, తరిగిన టమాటాలు -2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, పెరుగు -3 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 3 టీ స్పూన్స్, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క- ఒక చిన్న ముక్క, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
ఆలూ కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు, మసాలా దినుసులు వేసి వేయించాలి. వీటిని ఒక జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత ఇందులో టమాట ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పెరుగు వేసి కలపాలి.
దీనిని ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, బగారా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బంగాళాదుంప కూరల కంటే ఈ విధంగా చేసిన ఆలూ కుర్మా మరింత రుచిగా ఉంటుంది.